ఎక్కడి నుంచి డ‌బ్బులు తెస్తావ్ కేసీఆర్‌?

Update: 2018-10-17 08:00 GMT
ఊరుకుంటే.. ఉన్న గోచీని కూడా లాగేసేలా ఉన్నారు. తాజాగా టీఆర్ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిన్న ప్ర‌క‌టించిన త‌మ పార్టీ మేనిఫేస్టో వివ‌రాల్ని చూస్తే షాకింగ్ క‌ల‌గ‌క మాన‌దు. మొన్న‌టివ‌ర‌కూ కాంగ్రెస్ నేత‌ల్ని ఉద్దేశించి త‌న కుమారుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు.. ఇప్పుడు త‌న‌కు కూడా వ‌ర్తిస్తాయ‌న్న విష‌యాన్ని కేసీఆర్ పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుంది.

కాంగ్రెస్ ఇస్తున్న హామీల్ని అమ‌లు చేయాలంటే ద‌క్షిణాది రాష్ట్రాల బ‌డ్జెట్లు మొత్తం తెచ్చి పెట్టాలంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేటీఆర్.. ఈ రోజున త‌న తండ్రి ప్ర‌క‌టించిన మేనిఫేస్టో మీద ఏమంటారో?  ముంద‌స్తు వెళ్లే వేళ‌లో గెలుపు ధీమా ఉన్న‌ప్ప‌టికీ త‌ర్వాతి కాలంలో తత్త్వం బాగానే బోధ ప‌డింద‌న్న వైనం తాజా మేనిఫేస్టోను చూస్తే ఇట్టే అర్థం కాక మాన‌దు. నిన్న‌టి వ‌ర‌కూ పెద్ద‌గా ప‌ట్ట‌ని నిరుద్యోగులు ఇప్పుడు గుర్తుకు రావ‌ట‌మే కాదు.. ఏకంగా వారికి ప్ర‌తి నెల రూ.3016 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం చూస్తే.. యువ‌త‌లో నెల‌కొన్న అసంతృప్తిని బాగానే గుర్తించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

కాకుంటే..రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఎంద‌రు?  వారికి నెల‌కు రూ.3016 చొప్పున భృతి ఇవ్వ‌టం అంటే.. బ‌డ్జెట్ లో ఎంత భారీగా నిధులు కేటాయించాల్సి వ‌స్తుంద‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌. అదొక్క‌టేనా?  ఇప్ప‌టికే ఏటా రూ12వేల కోట్లు రైతుబంధు ప‌థ‌కం కింద ఖ‌ర్చుచేయాలి. తాజాగా ఇచ్చిన హామీ ప్ర‌కారం ఎక‌రాకు రూ.10వేలు చొప్పున అంటే ఇప్పుడు కేటాయించిన‌రూ.12వేల కోట్ల స్థానే రూ.15వేల కోట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి.

ఇక‌.. అస‌రా యోజ‌న ప‌థ‌కాన్ని 57 ఏళ్ల‌కు కుదించ‌టంతో ఈ భారం మ‌రింత పెరుగుతోంది. ఇవి కాక‌.. మేనిఫేస్టోలో ప్ర‌క‌టించిన ఇత‌ర తాయిలాల‌తో పాటు.. రైతుల‌కురుణామాఫీ ల‌క్షను కూడా అమ‌లు చేస్తే.. భారం భారీగా పెర‌గ‌ట‌మే కాదు.. బ‌డ్జెట్ లెక్క‌ల‌న్ని గ‌తి త‌ప్ప‌టం ఖాయం.

ప్ర‌భుత్వం పెట్టే ప్ర‌తి పైసా ఖ‌ర్చును.. తిరిగి ప్ర‌జ‌ల జేబుల్లో నుంచే లాక్కుంటార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఓప‌క్క పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్న వేళ‌.. జీఎస్టీ మోత మోగుతున్న నేప‌థ్యంలో తాజాగా ప్ర‌క‌టించిన తాయిలాల‌న్నీ అమ‌లు చేయాలంటే ప‌న్నుపోటు భారీగాపెర‌గ‌టం ఖాయం. ఇదంతా చూస్తే.. ప‌న్నులు క‌ట్టే వారు క‌డుతూ ఉంటే..ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాల్ని పొందే వారు అదే ప‌నిగా పొందుతార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అదే జ‌రిగితే.. ప‌న్నులు క‌ట్టే వారిలో అసంతృప్తి అంత‌కంత‌కూ పెర‌గ‌టం ఖాయం. ఇప్ప‌టికే.. పెరిగిన పెట్రోల్‌.. డీజిల్ ధ‌ర‌ల‌తో బ‌డ్జెట్ లెక్క‌లు మారిపోతున్న వేళ‌.. తాజాగా ప్ర‌క‌టించిన తాయిలాల్ని అమ‌లు చేయ‌టం మొద‌లు పెడితే.. జ‌నం జేబులు ప‌న్ను మోత మోగ‌టం ఖాయం. ఒక‌వేళ‌.. ప‌న్నులు విధించ‌కుంటే.. బ‌య‌ట నుంచి అప్పుల్ని తీసుకొస్తారు. ఏదో ఒక రోజు అప్పుల పాపం బ‌ద్ధ‌లై.. అంద‌రిని చుట్టేయ‌టం ఖాయం. పాల‌కులు ప‌వ‌ర్ క‌క్కుర్తికి ప్ర‌జ‌లు ఆగ‌మాగం కావాల్సిందేనా?
Tags:    

Similar News