ఎస్సీ..ఎస్టీ ఇష్యూలో ఎంపీలో బీజేపీకి దెబ్బే!

Update: 2018-04-03 05:42 GMT
కొన్నిసార్లు అంతే. టైం బాగోలేన‌ప్పుడు ఎప్పుడేం జ‌రుగుతుందో అస్సలు ఊహించ‌లేం. బీజేపీ విష‌యంలోనూ ఇప్పుడ‌దే జ‌రుగుతోంది. త‌న‌కేమాత్రం సంబంధం లేని విష‌యంలో బాధ్య‌త వ‌హించాల్సి రావ‌ట‌మే కాదు.. అందుకు త‌గిన ఫ‌లితాన్ని అనుభ‌వించే ప‌రిస్థితి ఎదురు కానుందా? అంటే అవున‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజాగా ఉత్త‌రాదిలో చోటు చేసుకున్న ఎస్సీ..ఎస్టీల చ‌ట్టంలోని కీల‌క నిబంధ‌న‌ల స‌వ‌ర‌ణ నిర‌స‌నాగ్ని బీజేపీకి భారీ దెబ్బ కొట్ట‌నుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

ఎస్సీ.. ఎస్టీల వేధింపుల నిరోధ‌క చ‌ట్టంలో కీల‌క మార్పుల‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ తీర్పు ప్ర‌కారం.. ఈ చ‌ట్టం కింద కంప్లైంట్ చేసిన వారిని వెంట‌నే అరెస్ట్ చేసే అవకాశం ఉండ‌దు. అంటే.. నిందితుడిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొనే వ్య‌క్తిని అరెస్ట్ చేసేందుకు వీలులేకుండా.. బెయిల్ ఇచ్చేలా సుప్రీం తీర్పు చెప్పింది. దీనిపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సుప్రీం తీర్పును వ్య‌తిరేకిస్తూ.. సోమ‌వారం భార‌త్ బంద్ జ‌రిగింది. ఈ బంద్ ప్ర‌భావం రెండు తెలుగు రాష్ట్రాల్లో త‌క్కువే అయినా.. ఉత్త‌రాది మాత్రం ఉడికిపోయేలా చేసింది. కొన్నిరాష్ట్రా్ల్లో ఈ బంద్ హింసాత్మ‌కంగా మారింది. ప‌లు చోట్ల ఘ‌ర్ష‌ణ‌ల‌కు తావిచ్చింది. మొత్తంగా ఈ బంద్ కార‌ణంగా చెల‌రేగిస‌న హింస‌కు 9 మంది మ‌ర‌ణించారు.

మ‌ర‌ణించిన వారిలో మ‌ధ్య ప్ర‌దేశ్‌ కు చెందిన ఆరుగురు.. యూపీకి చెందిన ఇద్ద‌రు.. రాజ‌స్థాన్‌ కు చెందిన ఒక‌రు ప్రాణాలు కోల్పోయారు. ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు రానున్న‌రోజుల్లో బీజేపీకి పెను శాపంగా మార‌తాయ‌ని చెబుతున్నారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు కొన్ని ముఖ్య‌మైన రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలా జ‌రిగే రాష్ట్రాలుగా క‌ర్ణాట‌క‌.. రాజ‌స్థాన్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మైన‌వి. ఇప్ప‌టికే క‌ర్ణాట‌క అసెంబ్లీకి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

మ‌రికొద్ది నెలల్లో రాజ‌స్థాన్.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలో ఉంది. రాజ‌స్థాన్ లో ఇప్ప‌టికే వ‌సుంధ‌రారాజె ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆ రాష్ట్రంలో అధికార మార్పిడి త‌ప్ప‌నిస‌రి అన్న అంచ‌నాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనూ బీజేపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో ఉంద‌న్న మాట వినిపిస్తోంది.

తాజాగా చోటు చేసుకున్న నిర‌స‌న‌..హింస‌లో ఆరు నిండు ప్రాణాలు పోవ‌టం.. ఆయా వ‌ర్గాల్లో బీజేపీపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త వ్య‌క్తం కావటం ప‌క్కా అంటున్నారు. అదే నిజ‌మైతే.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో త్వ‌ర‌లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు బీజేపీకి శాపంగా మార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌కు.. తాజా ప‌రిణామాలు బీజేపీకి ప్ర‌తికూలంగా మారిన ప‌క్షంలో.. 2019 ఫైన‌ల్స్ పైనా ఈ ప్ర‌భావం ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. టైం బాగున్న‌ప్పుడు ప్ర‌తిదీ అనుకూలంగా మారిన‌ట్లే.. కాలం క‌లిసి రాన‌ప్పుడు టెంకాయి కూడా టైంబాంబ్ మాదిరి పేలుతుందంటే.. ఇదేనేమో?
Tags:    

Similar News