ఏపీలో వామ‌ప‌క్షాల దారెటు?

Update: 2018-12-01 09:35 GMT
తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం వామ‌ప‌క్షాల ప్రాబ‌ల్యం అంతంత మాత్ర‌మే! రెండు రాష్ట్రాల్లోనూ 1-2 సీట్ల కంటే ఎక్కువ గెల్చుకునే స్థితిలో లేర‌నే చెప్పుకోవ‌చ్చు. అయితే - చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వారికి క్షేత్ర‌స్థాయిలో మ‌ద్దుతుదారులున్నారు. ఏ ఎన్నిక‌లు జ‌రిగినా వామ‌ప‌క్షాల‌కే ఓటేసే కొంత‌మంది ఇరు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. త‌మ అభ్య‌ర్థుల‌ను గెలిపించుకునేంత స్థాయిలో వారి ఓట్లు లేకున్నా.. ఇత‌రుల జ‌యాప‌జ‌యాల‌ను ప్ర‌భావితం చేయ‌గ‌లిగే స‌త్తా వారికి కొన్ని స్థానాల్లో ఉంద‌నేది కాద‌న‌లేని వాస్త‌వం.

ప్ర‌ధాన వామ‌ప‌క్ష పార్టీలైన సీపీఐ - సీపీఎం తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో చీలిపోయాయి. కాంగ్రెస్ - టీడీపీ - టీజేఎస్‌ ల‌తో క‌లిసి సీపీఐ ప్ర‌జా కూట‌మిలో భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉంది. సీపీఎం మాత్రం ప‌లు చిన్నాచిత‌కా పార్టీల‌ను క‌లుపుకొని బీఎల్ఎఫ్ కూట‌మిని ఏర్పాటుచేసింది. ప్ర‌స్తుతం సీపీఐ - సీపీఎం త‌మ పార్టీల అభ్య‌ర్థుల త‌ర‌ఫున జోరుగా ప్ర‌చారం చేస్తున్నాయి. ఇక్క‌డ ఏమేర‌కు త‌మ ప్ర‌భావం చూపుతాయో త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

మ‌రోవైపు - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఆర్నెళ్ల స‌మ‌యం కూడా లేదు. ఈ నేప‌థ్యంలో ఏపీలో వామ‌ప‌క్షాల దారెటు అనే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలో దాదాపు ఏడాది క్రితం వ‌ర‌కు సీపీఐ - సీపీఎం పార్టీలు రెండూ జ‌గ‌న్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి న‌డిచాయి. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోరాటాలు చేశాయి. క్ర‌మంగా ఈ పార్టీల వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల త‌ర్వాత వైసీపీతో దోస్తీని వామ‌ప‌క్షాలు తెంచుకున్నాయి.

వైసీపీతో స్నేహాన్ని తెంచుకున్న అనంత‌రం ఏపీలో వామ‌ప‌క్షాలు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌కు ద‌గ్గ‌ర‌య్యాయి. ఒక ద‌శలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో వామ‌ప‌క్షాల పొత్తు ఖాయ‌మ‌ని అంతా అనుకున్నారు. జ‌న‌సేన‌తో క‌లిసి వామ‌ప‌క్ష నేత‌లు చాలా సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. అయితే - టికెట్ల పంప‌కంపై ప‌వ‌న్ నుంచి  నుంచి ఎలాంటి హామీ ల‌భించ‌క‌పోవ‌డంతో వామ‌ప‌క్షాలు సందిగ్ధంలో ప‌డ్డాయ‌ట‌. త‌మ మ‌ద్ద‌తును ప‌వ‌న్ అప‌హాస్యం చేస్తున్నార‌ని అల‌క వ‌హించాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు ఇచ్చే సీట్ల సంఖ్య‌పై ప‌వ‌న్ త్వ‌ర‌లోనే తేల్చ‌క‌పోతే త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌తో దోస్తీకి కూడా స్వ‌స్తి ప‌ల‌కాల‌ను యోచిస్తున్నాయ‌ట‌.

అయితే - ఒంటిరిగా బ‌రిలో దిగేటంత బ‌లం త‌మ‌కు లేద‌ని వామ‌ప‌క్షాల‌కు కూడా తెలుసున‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అందుకే జ‌న‌సేన‌తో దోస్తీని అవి అంత సులువుగా తుంచుకోవ‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో ఏపీలో వామ‌ప‌క్షాలు ఎలా వ్య‌వ‌హ‌రిస్తాయ‌న్న‌ది ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News