పోటీ పడుతున్న తెలుగు రాష్ట్రాలు

Update: 2021-08-01 10:43 GMT
తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ ఎందులోనో అనుకుంటున్నారా ? ఖజనాను గుల్లచేయటంలో. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణా రాష్ట్రం మిగులు బడ్జెట్ తో మొదలైంది. ఇదే ఏపి విషయానికి వచ్చేసరికి లోటు బడ్జెట్ తో మొదలైంది. కాలం గిర్రున తిరిగేటప్పటికి ఏపి లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోతుంటే ఇదే దారిలో తెలంగాణా ప్రభుత్వం కూడా చాలా స్పీడుగా దూసుకుపోతోంది.

ఇపుడిదంతా ఎందుకంటే కొత్త కొత్త పథకాలను ప్రకటిస్తుండటంతో తెలంగాణా ఖజానా ఒట్టిపోయింది. తాజాగా ప్రకటించిన దళితబంధు పథకం అమలుకు ఖజానాలో నిధులు నిల్లు. దళితబంధు పథకం అమలుకు రు 3 వేల కోట్లవసరమని తేలింది. అయితే ఖజానాలో రూపాయి కూడా లేదు. అందుకనే వివిధ శాఖల్లోని కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రు. 13 వేల కోట్లను ప్రభుత్వం బకాయిలు పెట్టింది. లక్షలోపు చేయాల్సిన పంటరుణాల మాఫీకి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు.

కొత్త కార్డులు, పెన్షన్లకు ఇప్పటికే తెలంగాణా ప్రభుత్వం రు. 21 వేల కోట్లను అప్పులు చేసింది. ఖజానా వట్టిపోయినా పర్వాలేదు కానీ తామిచ్చిన హామీలను మాత్రం అమలు చేయాల్సిందే అని కేసీయార్ గట్టిగా పట్టుబడుతుండటంతో ఆర్ధికశాఖ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారింది. ఆదాయాలు తగ్గిపోతున్నాయి, అప్పులు పెరిగిపోతున్నాయి, హామీల భారం పెరిగిపోతోంది అయినా కేసీయార్ వెనక్కు తగ్గటంలేదు. ఆదాయాన్ని పెంచుకోవటానికి హైదరాబాద్ ఉందన్న ధైర్యంతోనే అప్పులు చేసేస్తున్నారు.

మరి ఆదాయాన్ని పెంచుకునే పరిస్దితి ఏపిలో ఎక్కడా కనబడటంలేదు. జగన్ కూడా తనిష్టం వచ్చినట్లు సంక్షేమ పథకాలు అమలు చేసేస్తున్నారు. కరోనా వైరస్ కష్టకాలంలో కూడా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. తనది సంక్షేమ ప్రభుత్వమని జగన్ చాటుకుంటున్నారు. అయితే సంక్షేమంతోనే రాష్ట్రాన్ని ఎక్కువ కాలం నడపలేనని మరచిపోయినట్లున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగినపుడే సంక్షేమ పథకాల అమలుకు నిదులందుతాయి. ఆదాయాలను పెంచుకునే మార్గాలను చూసుకోకుండా తమిష్టం వచ్చినట్లు నిధులను పంచుకుంటు వెళిపోతే ప్రభుత్వం కుప్పకూలిపోవటం ఖాయమని గ్రహించాలి.
Tags:    

Similar News