సమ్మెలో ఆ కామ్రేడ్ వేలు కట్ అయిపోయింది

Update: 2019-10-19 11:33 GMT
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా తెలంగాణ బంద్ కు పిలుపునివ్వటం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విపక్షాలు.. ప్రజాసంఘాలు.. ఉద్యోగ సంఘాలతో పాటు ఇతర సంస్థలు సకల జనుల సమ్మ కు తమ మద్దతు తెలిపాయి. ఈ రోజు ఉదయం (శనివారం) నుంచి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ నునిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ మహానగరానికి సంబంధించి చూస్తే.. సమ్మెకు అనుకూలంగా వామపక్ష పార్టీలకు చెందిన నేతలు.. ప్రజా సంఘాల నేతలు పెద్దఎత్తున ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద నిరసన చేపట్టారు. దాదాపు రెండు గంటలకు పైనే సాగిన ఈ నిరసన కార్యక్రమం అంతకంతకూ తీవ్ర రూపం దాలుస్తున్న వేళ.. కమ్యునిస్ట్ ముఖ్యనేతల్లో పలువురు అక్కడే ఉన్నారు. దీంతో వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.

పోలీసుల చర్యకు నిరసనగా నినాదాలుచేస్తున్న వైనంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇలాంటివేళ అనూహ్య పరిణామం ఒకటి ఏర్పడింది. సీపీఐ ఎంఎల్ నేత పోటు రంగారావు చేతికి తీవ్ర గాయమైంది. ఆందోళన చేస్తున్నఆయన్ను పోలీసులు బలవంతంగా వ్యాన్ లోకి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేయి రెండు తలుపుల మధ్య ఇరుక్కుంది. దాన్ని బయటకు తీసేక్రమంలో అనుకోని రీతిలో ఆయన బొటనవేలు తెగిపోయింది.

తీవ్ర గాయమై..రక్తమోడుతున్నా పట్టించుకోకుండానిరసన చేస్తున్న ఆయన తీరుతో అక్కడి వారు అవాక్కు అయ్యారు. ఇదిలాఉంటే పోలీసుల తీరును పలువురు తప్పు పడుతున్నారు.  తనను కేసీఆర్ చంపేయమన్నారా? అంటూ పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాన ఉద్యమంలో పాల్గొనందుకు.. ఇప్పుడు కార్మికుల పక్షాన నిలిచినందుకు తనకు లభించిన బహుమతిగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులే తన చేతిని తలుపులమధ్య పెట్టి నలిపేశారని.. వారి వల్లే గాయమైనట్లు ఆరోపించారు. దీంతో.. పోలీసుల చర్యపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News