అసెంబ్లీలో కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేల నిర‌స‌న‌!

Update: 2018-05-17 05:19 GMT
స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోన్న కర్ణాటక రాజకీయాలు కీల‌క మ‌లుపు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. నిన్న రాత్రి యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌ల్సిందిగా కర్ణాటక గవర్నర్ లేఖ రాయడం మొద‌లు....నేడు ఉద‌యం యడ్డీ ప్ర‌మాణ స్వీకారం చేసే వ‌ర‌కు కన్న‌డ నాట హైడ్రామా న‌డిచింది. గవర్నర్ నిర్ణయంపై స్టే కోరుతూ నిన్న రాత్రి సుప్రీం త‌లుపు త‌ట్టిన కాంగ్రెస్, జేడీఎస్ ల కు నిరాశే మిగిలింది. గవర్నర్ అధికారాల్ని తాము అడ్డుకోలేమని, అయితే, ఆ పిటిషన్ ను శుక్ర‌వారం నాడు మ‌రోసారి విచార‌ణ చేప‌డ‌తామ‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. య‌డ్డీ అనుకున్న విధంగానే 17 వ తేదీ ఉద‌యం 9.30 కు ప్ర‌మాణ స్వీకారం చేసి పంతం నెగ్గించుకున్నారు. ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంపై కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద బైఠాయించారు. య‌డ్డీ ప్ర‌మాణ స్వీకారానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలుపుతూ ఆందోళ‌న చేప‌ట్టారు.

సంఖ్యాబలం లేకుండానే య‌డ్యూర‌ప్ప సీఎం కావ‌డం....అందుకు గ‌వ‌ర్న‌ర్ స‌హ‌క‌రించ‌డం వంటి అనైతిక విష‌యాల‌ను దేశ‌వ్యాప్తంగా చాటి చెప్పేందుకు కాంగ్రెస్ - జేడీఎస్ లు నిర‌స‌న చేప‌ట్టాయి. గ‌వ‌ర్న‌ర్ పై - య‌డ్డీ ప్ర‌మాణ స్వీకారంపై నిర‌స‌న తెలుపుతూ రిసార్ట్ నుంచి కాంగ్రెస్ - జేడీఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి త‌ర‌లి వ‌చ్చారు. వీరంతా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద బైఠాయించి నిర‌స‌న తెలుపుతున్నారు. వీరికి తోడుగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేతలు గులాం న‌బీ ఆజాద్ - అశోక్ గెహ్లాట్ - కాంగ్రెస్ లోక్ స‌భ ప‌క్ష నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే - క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య కూడా అక్క‌డ బైఠాయించారు. తాత్కాలికంగా బీజేపీ విజ‌యం సాధించినా....అంతిమంగా న్యాయం గెలుస్తుంద‌ని కాంగ్రెస్ నేత‌లు అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అప‌హాస్యం చేసింద‌ని సిద్ధ‌రామ‌య్య మండిప‌డ్డారు. కోర్టులో పిటిష‌న్ ఉన్నా కూడా ప్ర‌మాణ స్వీకారం చేయ‌డం ఏమిట‌ని నిప్పులు చెరిగారు. య‌డ్యూర‌ప్ప‌ ఒక్క రోజు ముఖ్య‌మంత్రిగా మిగిలిపోతార‌ని ఎద్దేవా చేశారు. గ‌వ‌ర్న‌ర్ తీరును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌ట్ట‌బోతున్నామ‌ని తెలిపారు.
Tags:    

Similar News