గుజరాత్ కే గురి : బీజేపీ ఓడితే ఇక సరి

Update: 2022-09-04 01:30 GMT
గుజరాత్ మోడల్ అంటూ దేశం మొత్తాన్ని తన వైపుగా తిప్పుకుని ప్రధాని అయిన నరేంద్ర మోడీ తన రాజకీయ అస్థిత్వం అంతా గుజరాత్ కోటలోనే దాచి ఉంచేశారు. మోడీ ఏ దేశమేగినా ఎందుకాలిడినా కానీ గుజరాత్ లో ఆయన రాజకీయ పునాదులు బలంగా ఉంటేనే చెల్లుబాటు అయ్యేది. గత పాతికేళ్ళుగా గుజరాత్ ని కాషాయం పార్టీకి కంచుకోటగా చేసి అందులో సగానికి పైగా తన ముఖ్యమంత్రిత్వంలో తరింపచేసిన మోడీకి గుజరాత్ అంటే రాజకీయంగా ఆరోప్రాణం అనే చెప్పాలి.

అలాంటి గుజరాత్ కి ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి గుజరాత్ లో రేసులో కాంగ్రెస్ కంటే కొత్తగా వచ్చిన ఆప్ భయపెట్టేస్తోంది. ఇప్పటికే ఢిల్లీతో పాటు అవతల పంజాబ్ ని కూడా గెలిచి తన ఖాతాలో వేసుకుని దేశంలో ఎల్లెడలా విస్తరించాలని చూస్తున్న ఆప్ కి ఇపుడు గుజరాత్ మీద మోజు పెరిగింది. మోడీ మాస్టార్ కి పొలిటికల్ గా అసలైన   ట్రబుల్స్ ఏంటో చూపించాలి అంటే ఆయన కంచుకోట గుజరాత్ లోనే దెబ్బ కొడితే సరిపోతుంది అని సరిగ్గానే అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు.

అది లగాయితూ ఆయన గుజరాత్ ని చుట్టిపారేస్తున్నారు. ఇక ఆయన వరసబెట్టి చేస్తున టూర్లు కానీయండి. కొత్త రాజకీయం అని జనాలను తిప్పుకుంటున్న తీరు కానీయండి ఇస్తున్న హామీలు కానీయండి ఇప్పటికి ముప్పయ్యేళ్ళుగా బీజేపీ పాలిత రాష్ట్రంగా ఉంటూ వస్తున్న గుజరాత్ వాసులకు కొత్త రుచులను చూపిస్తోంది అని అంటున్నారు. నిజంగా బీజేపీకి ఇపుడు అక్కడ బలంగా యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంటున్నారు. దీనికి ముందు 2017లో జరిగిన ఎన్నికల్లోనే బీజేపీ నిజానికి ఓడాలి.

కానీ కాంగ్రెస్ సరైన వ్యూహం సిద్ధం చేసుకోలేకపోవడంతో బీజేపీకి చివరిలో బాగా కలసివచ్చింది. ఇపుడు ఆప్ అలా కాదు, దానికి మోడీ లాంటి కేజ్రీవాల్ నాయకత్వం ఉంది. పైగా ఆయన చేస్తున్న ప్రసంగాలు మోడీనే నేరుగా గురి పెడుతున్న తీరు అన్నీ చూశాక బీజేపీ పెద్దలలో నిజంగానే కంగారు పట్టుకుంది అంటున్నారు. ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉంటూ కీలక పదవుల్లో కొనసాగుతూ అటు పార్టీకి ఇటు ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న మోడీ అమిత్ షాలకు గుజరాత్ పెట్టని కోట.

అక్కడే గురి పెట్టి కోటను కూలుస్తాను అని కేజ్రీవాల్ క్రేజీగా శపధం చేయడం లేదు, సర్వేల సాక్షిగానే ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. రాసిపెట్టుకోండి ఈసారి వచ్చేది మేమే అని కూడా ఆయన గట్టిగా సౌండ్ చేస్తున్నారు. ఇక వివిధ రకాలైన సర్వే ఫలితాలు కూడా ఆప్ గుజరాత్ లో ముందంజలో ఉందని తెలియచేస్తోంది. ఈ సర్వేలను ఫలితాలను పక్కన పెడితే ఢిల్లీలో ఆప్ మీద దాని మంత్రుల మీద పెడుతున్న‌ కేసులు ఈడీ వంటి వాటి దాడులు చూశాక గుజరాత్ లో బీజేపీ పరిస్థితి ఏంటో లాజికల్ ఆలోచించేవారికి అంచనాకు అందినట్లే అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఆప్ చెప్పినట్లుగా నిజంగా గుజరాత్ కోటను కుప్ప కూల్చి అధికారం చేపడితే 2024 ఎన్నికల్లో మోడీ షాల పొలిటికల్ షోకు ఏణ్ణర్ధం ముందే అసలైన ట్రబుల్స్ స్టార్ట్ అవుతాయని అంటున్నారు. గుజరాత్ నే గెలిచేశాక మోడీ చెప్పుకునే మోడల్ అన్నదే మారిపోయాక, అది ఇంకొకరికి జై కొట్టాక రేపు దేశం మాత్రం ఎందుకు మాట వింటుంది. ఎందుకు బీజేపీ బాటలో పయనిస్తుంది. మొత్తానికి కేజ్రీవాల్ అటు నుంచి తెలివిగానే నరుక్కువస్తున్నారు. ఇందులో సక్సెస్ అయితే మోడీ పీఠానికే ముప్పు వాటిల్లుతుంది అనడంలో సందేహమే లేదు అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News