బీజేపీకి చెక్‌.. బీఎస్పీ-కాంగ్రెస్ పొత్తు

Update: 2019-09-09 12:14 GMT
కేంద్రంలో అప్ర‌తిహ‌త విజ‌యాన్నిసొంతం చేసుకుని.. రాష్ట్రాల్లోనూ విజ‌యం సాధించి అధికారాన్ని చేప‌ట్టే దిశ‌గా అడుగులు వేస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ - బీజేపీ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ కొత్త ఎత్తు వేసింది. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హ‌రియాణా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలో బీజేపీకి అధికారం ద‌క్క‌కుండా చేసే క్ర‌మంలో కాంగ్రెస్ ఇప్ప‌టి నుంచే పావులు క‌దిపింది. దీనిలో భాగంగా బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ(బీఎస్పీ) తో పొత్తుకు సిద్ధ‌మైంది. తాజాగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. హ‌రియాణాలో ప‌ర్య‌టించి ఎన్నిక‌ల ప్ర‌చారానికి అన‌ధికారికంగానే శ్రీకారం చుట్టారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ తన వ్యూహాలకు పదునుపెడుతోంది. దీనిలో భాగంగానే బీఎస్పీతో పొత్తుకు ముందడుగేసింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత భూపేందర్‌ సింగ్‌ హుడా ఆదివారం బీఎస్పీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదనపై ఇరువురు చర్చించారు. దీనికి మాయావతి కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

రాజస్తాన్‌ - మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ - కాంగ్రెస్‌ కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అదే పొత్తును హర్యానాలో కూడా కొనసాగించాలని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే దీనిపై బహిరంగ ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికల ప్రకటన వెలువడనుంది. అయితే, ఇప్ప‌టికే ప్ర‌చారాన్ని ప్రారంభించిన బీజేపీ ఏ విధంగా దూసుకుపో తుంది?  అధ్య‌క్షుడు కూడా లేని కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా మ‌రింత టార్గెట్ చేస్తుంది ? అనే విష‌యాలు తెలియాల్సి ఉంది.

రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీ చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల్లో జ‌మ్ము కశ్మీర్ కు చెందిన 370 ఆర్టిక‌ల్ ఎత్తివేత త‌ప్ప ర‌వాణా చ‌ట్టం స‌వ‌ర‌ణ‌ - కొత్త చ‌ట్టం అమ‌లు వంటివాటిపై దేశ‌వ్యాప్తంగా కూడా తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంది. దీంతో ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ప్ర‌బ‌లుతున్న మాట వాస్త‌వం. మ‌రి ఇది హ‌రియాణా ఎన్నిక‌ల్లో రిఫ్లెక్ట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.
 
Tags:    

Similar News