రాజ్భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు .. బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు .. భద్రత కట్టుదిట్టం

Update: 2021-07-16 09:56 GMT
పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన చలో రాజ్‌ భవన్‌ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి విదితమే. ఇప్పటికే నగరానికి  కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా చేరుకున్నారు. ధర్నాలో 200 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. చలో రాజ్‌భవన్‌ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపుతో చలో రాజ్‌ భవన్‌  కు బయల్దేరుతుండగా పలుచోట్ల ఆ పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా ఇళ్ల వద్దే నిర్బంధించారు. కార్యకర్తలు తరలివెళ్లకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.  ఇందిరా పార్క్‌లో కాంగ్రెస్‌ ధర్నా ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇందిరాపార్క్‌ వద్ద గల ధర్నాచౌక్‌కు  చేరుకోనున్నారు.

అయితే, పలువురు కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ వద్ద హల్ చల్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి రాజ్ భవన్‎కు చేరుకుని రాజ్‎భవన్ గేటుకు కాంగ్రెస్ జెండాలు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌ కు తరలించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్‌ అయ్యారు. భద్రతా వైఫల్యంపై సమీక్ష నిర్వహించారు. అధికారుల ఫిర్యాదుతో కాంగ్రెస్ జెండాలు పెట్టిన ఇద్దరిపైనా పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, రాజ్‌భవన్ గేట్ బయట ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసింది. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో హుటాహుటిన సీసీ కెమెరాలు మరమ్మతు చేపట్టినట్టు సమాచారం.

 కాగా, చలో రాజ్‌ భవన్‌ అడ్డుకుంటే పోలీస్‌స్టేషన్‌ ను ముట్టడిస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన చలో రాజభవన్‌ కు వస్తున్న వేలాది మంది నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా కోసం అనుమతికి దరఖాస్తు చేశామన్నారు.  పోలీసులు  గృహ నిర్బంధాలు, అరెస్టులు చేయడం రాజరిక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.  

కాంగ్రెస్ పార్టీ చలో రాజ్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో రాజ్ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. రాజ్ భవన్ వైపు కాంగ్రెస్ శ్రేణులు దూసుకురాకుండా బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచె ఏర్పాటు చేయడంతో పాటు రోప్ పార్టీ సిద్ధం చేశారు. ఇందిరా పార్కు నుంచి వెళ్లే వాహనాల రాకపోకలను దారి మళ్లించారు.
Tags:    

Similar News