కాంగ్రెస్ పెద్దోళ్ల‌కు అధిష్ఠానం షాక్

Update: 2018-09-26 07:10 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌ను బ‌రిలోకి దించాల‌ని ఉవ్విళ్లూరుతున్న సీనియ‌ర్ నేత‌ల‌కు కాంగ్రెస్ అధిష్ఠానం షాకిచ్చిన‌ట్లు తెలుస్తోంది. వార‌సుల‌కు టికెట్లు ఇవ్వ‌లేమ‌ని.. అవ‌స‌ర‌మైతే సీనియ‌ర్లు త‌మ సీట్ల‌ను త్యాగం చేసి పిల్ల‌ల‌ను బరిలో నిల‌పాల‌ని సూచిస్తున్న‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం అందుతోంది.

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో రాజ‌కీయ కాక పెరిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ లో ప‌లువురు సీనియ‌ర్లు త‌మ వార‌సుల‌ను వెంటబెట్టుకొని దిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. అధిష్ఠానం పెద్ద‌ల చుట్టూ ప్ర‌దక్షిణ‌లు చేస్తున్నారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో త‌మ‌తోపాటు త‌మ వార‌సుల‌కూ సీట్లివ్వాల‌ని విన్న‌విస్తున్నారు. వారిని గెలిపించుకునే బాధ్య‌త త‌మ‌దేన‌ని హామీ ఇస్తున్నారు.

అయితే, వారి విన్న‌పాల‌పై కాంగ్రెస్ అధిష్ఠానం సానుకూలంగా స్పందించ‌డం లేద‌ని తెలుస్తోంది. వార‌సత్వ రాజ‌కీయాలు చేస్తున్నార‌నే ముద్ర ఇప్ప‌టికే పార్టీపై ఉంద‌ని.. ఆ ముద్ర‌ను తొల‌గించుకోవాల‌ని చూస్తున్న ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ వార‌సుల‌కు సీట్ల‌డ‌గ‌డ‌మేంట‌ని నేత‌ల‌ను అధిష్ఠానం ప్ర‌శ్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. తామైతే వార‌సుల‌కు సీట్లు ఇవ్వ‌లేమ‌ని.. అవ‌స‌ర‌మైతే మీరే సీటు త్యాగం చేసి పిల్ల‌ల‌ను బ‌రిలో దించుకోవాల‌ని కూడా పార్టీ స్ప‌ష్టం చేసింద‌ట‌. దీంతో వార‌సుల రాజ‌కీయ అరంగేట్రంపై ఎన్నెన్నో ఆశ‌లు పెట్టుకున్న ప‌లువురు నేత‌లు ప్ర‌స్తుతం నిరాశ‌లో ఉన్నార‌ని స‌మాచారం.

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తాను గోషామహల్ నుంచి బ‌రిలో దిగాల‌ని - తన కుమారుడు విక్రమ్‌ గౌడ్‌ ను ముషీరాబాద్ నుంచి పోటీ చేయించాల‌ని యోచిస్తున్నారు. సికింద్రాబాద్‌ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్ కూడా తన కుమారుడు అనిల్ కుమార్‌ కు ముషీరాబాద్‌ టికెట్‌ ఇవ్వాలని అడుగుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ తన కుమార్తె స్నిగ్ధను మక్తల్‌ నుంచి బరిలో నిలపాలని ఆశిస్తున్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి తన సిట్టింగ్‌ స్థానమైన నాగార్జునసాగర్‌ తనకు - కుమారుడు రఘువీర్‌ రెడ్డికి మిర్యాలగూడ సీటు అడుగుతున్నార‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News