చిరుకు చింతా అప్ప‌ట్లోనే ఆ స‌ల‌హా ఇచ్చార‌ట‌

Update: 2017-12-27 10:50 GMT
ఏపీ కాంగ్రెస్‌ లో సుదీర్ఘ‌కాలం పాటు ఎంపీగా వ్య‌వ‌హ‌రించిన చింతామోహ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి కొత్త విష‌యాలు చెప్పుకొచ్చారు. ప్ర‌జారాజ్యం పార్టీ స్టార్ట్ చేసిన చిరంజీవి త‌ర్వాత కాలంలో ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. చిరంజీవికి తాను 1993లోనే రాజ‌కీయాల్లోకి రావాల‌ని స‌ల‌హా ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. ఒక‌వేళ తాను చెప్పిన‌ట్లుగా 1993లోనే చిరంజీవి పాలిటిక్స్ లోకి వ‌చ్చి ఉన్న‌ట్లైయితే.. ఆయ‌న త‌ప్ప‌నిస‌రిగా ప‌వ‌ర్లోకి వ‌చ్చేవార‌న్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్టి రాజ‌కీయాల్ని మార్చేస్తాన‌న్న చిరు.. త‌ర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి త‌న పార్టీని మార్చేసిన వైనం తెలిసిందే.

చిరుకు తానిచ్చిన రాజ‌కీయ స‌ల‌హా గురించి చెప్పిన చింతా మోహ‌న్‌.. ఏపీ స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేప‌ట్టిన పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి స‌రికొత్త విమ‌ర్శ‌లు చేశారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ప్ర‌ధాని మోడీలు ఇద్ద‌రికి పోల‌వ‌రం ప్రాజెక్టులో అవినీతి మ‌ర‌క అంటింద‌న్నారు. సొమ్ము ఒక‌డిది.. సోకు మ‌రొక‌డిదన్న రీతిలో పోల‌వ‌రం ప్రాజెక్టును మార్చేశార‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో ప్ర‌ధాని మోడీకి అవినీతి మ‌ర‌క అంటింద‌న్నారు.

పోల‌వ‌రం ప్రాజెక్టులో 50 శాతం అవినీతి చోటు చేసుకున్న‌ట్లు చెప్పారు. పోల‌వ‌రం పేరుతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కోట్లు దోచుకుంటున్నార‌న్నారు.

చంద్ర‌బాబు దోచుకుంటుంటే.. ప్ర‌ధాని మోడీ మౌనంగా ఎందుకు ఉన్నార‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంద‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టులో చోటు చేసుకుంటున్న అవ‌నితికి సంబంధించి సీబీఐతో విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు. మ‌రో కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పేరుతోనే నీతి ఉంద‌న్న ఆయ‌న‌.. స‌ద‌రు మంత్రి చేసేదంతా అవినీతేన‌న్నారు. ఏపీలో కాపులు.. ద‌ళితులు ఏకం కావాల‌ని.. రాబోయే రోజుల్లో శ్రీకాకుళం  నుంచి గోదావ‌రి జిల్లాల మ‌ధ్య వారికి మాత్ర‌మే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌న్న డిమాండ్ ను తెర మీద‌కు తీసుకొచ్చారు.
Tags:    

Similar News