గాలి కోట‌ను కూల్చేసిన కాంగ్రెస్!

Update: 2018-11-06 10:06 GMT
దేశంలో కాంగ్రెస్‌ కు అత్యంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ఏది అని అడిగితే చాలా మంది రాయ్‌ బ‌రేలీ లేదా అమేథీ అని చెబుతుంటారు. కానీ... ఢిల్లీ పీఠంపై ద‌శాబ్దాల పాటు రాజ్య‌మేలిన కాంగ్రెస్‌ కు అత్యంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గం ద‌క్షిణ భార‌త‌దేశంలోని బ‌ళ్లారి నియోజ‌క‌వ‌ర్గం. ఇది పేరుకు క‌ర్ణాట‌కే అయినా అత్య‌ధికులు తెలుగువారు. 1951 మొద‌టి లోక్ స‌భ ఎన్నిక‌లు మొద‌లు 2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆ నియోజ‌క‌వ‌ర్గం కాంగ్రెస్‌ కు కంచుకోట‌. అక్క‌డ ఒక్కో అభ్య‌ర్థి మూడు సార్లు వ‌రుస‌గా గెలిచిన సంద‌ర్భాలు చాలా సార్లున్నాయి. అంత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాన్ని కాంగ్రెస్ నుంచి లాక్కున్న కుటుంబం గాలి జ‌నార్ద‌న్‌ రెడ్డి కుటుంబం. 2004 త‌ర్వాత ఇక ప్ర‌తి ఎన్నిక‌లో బీజేపీ త‌ర‌ఫున గాలి కుటుంబ‌మే గెలుస్తూ వ‌స్తోంది. 2004 - 2009 లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా గాలి కుటుంబం నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని తిరిగి దక్కించుకోలేక‌పోయాయి. ఇన్నాళ్ల‌కు కాంగ్రెస్ క‌ల నెర‌వేరింది.

2004 - 2009 - 2014 ఎన్నిక‌ల్లో గాలి వ‌శ‌మైన బ‌ళ్లారి నియోజ‌క‌వ‌ర్గం అత్యంత నాట‌కీయ ప‌రిణామాల్లో మ‌ళ్లీ చేతికి చిక్కింది. ఎలాగూ బీజేపీ క‌ర్ణాట‌క‌లో అధికారంలోకి వ‌స్తుంద‌న్న ఆశ‌తో బ‌ళ్లారి లోక్‌ స‌భ ఎంపీ శ్రీ‌రాములు దానికి రాజీనామా చేశారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఇపుడు గాలి సోద‌రి నిల‌బ‌డినా కూడా ఆమెపై జేడీఎస్ మ‌ద్ద‌తుతో కాంగ్రెస్ ఘ‌న విజ‌యం సాధించింది. బీజేపీ అభ్య‌ర్థి శాంత‌ పై కాంగ్రెస్ అభ్య‌ర్థి ఉగ్ర‌ప్ప లోక్‌ స‌భ ఎంపీగా గెలుపొందారు. దీంతో బ‌ళ్లారి కోట కూలిన‌ట్ల‌య్యింది. అంటే బ‌ళ్లారి వంటి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పూర్వ వైభ‌వం సంపాదించుకుందంటే.. బ‌హుశా దేశంలో మ‌ళ్లీ బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారం లాక్కున్నా ఆశ్చ‌ర్యం ఉండ‌క‌పోవ‌చ్చు. క‌నీసం పొత్తుల్లో అయినా ఈసారి ఢిల్లీ పీఠం ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

అయితే, బ‌ళ్లారి కోల్పోవ‌డం గాలి కుటుంబానికి కేవ‌లం ఓట‌మి కాదు - అవ‌మానం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. బ‌హుశా తెలుగు వారి విష‌యంలో బీజేపీ వ్య‌వ‌హ‌రించిన తీరు కూడా దీనికి కార‌ణం కావొచ్చంటున్నారు.
    

Tags:    

Similar News