ప్ర‌గ‌తి నివేద‌న కాదు.. టీఆర్ఎస్ ఆవేద‌న స‌భా?

Update: 2018-08-30 09:51 GMT
క‌నివినీ ఎరుగ‌ని రీతిలో పాతిక ల‌క్ష‌ల మందితో ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌ను నిర్వ‌హిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న సృష్టిస్తోన్న సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. ఈ భారీ స‌భ‌కు అస‌లు కార‌ణం.. ముంద‌స్తు ఎన్నిక‌లే అన్న‌మాట బ‌లంగా వినిపిస్తోంది. స‌భతో వ‌చ్చే భారీ మైలేజీతో.. రెట్టించిన ఉత్సాహంతో ముంద‌స్తుకు దూసుకెళ్లేలా కేసీఆర్ ప్లాన్ చేశార‌ని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ స‌భ‌పై కాంగ్రెస్ నేత‌లు పంచ్ ల మీద పంచ్ లు విసురుతున్నారు. ఇప్ప‌టికే. ఈ స‌భ‌కు సంబంధించి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మార‌ట‌మే కాదు.. అంద‌రి నోటా నానేలా చేశాయి. తాజాగా ఈ స‌భ‌పై తెలంగాణ పీసీసీ సార‌థి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ్యంగ్య వ్యాఖ్య‌లు చేశారు. త‌న ట్విట్ట‌ర్ ఖాతా నుంచి ఆయ‌న చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది.

వంద‌ల కోట్ల‌తో నిర్వ‌హిస్తోన్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ కాద‌ని.. టీఆర్ఎస్ ఆవేద‌న స‌భ‌గా ఆయ‌న వ్యాఖ్యానించారు. స‌భ నిర్వ‌హ‌ణ కోసం వంద‌ల కోట్ల రూపాయిలు ఎక్క‌డి నుంచి వ‌స్తున్నాయ‌న్న విష‌యాన్ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఆరా తీయాల‌ని కోరారు. అంతేనా.. ఈ స‌భ‌కు వెచ్చిస్తున్న మొత్తానికి సంబంధించిన మూలాలు ఎక్క‌డ నుంచి ఉన్నాయ‌న్న విష‌యం మీద ఫోక‌స్ చేయాల‌ని ఆదాయ‌ప‌న్ను అధికారుల‌ను ఉత్త‌మ్ కోరుతున్నారు.

ఇదిలా ఉంటే.. సీనియ‌ర్ నేత జానారెడ్డి సైతం కేసీఆర్ నిర్వ‌హిస్తున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌ద‌స్సుపై అస్త్రాల్ని సంధిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్ని అమ‌లు చేయ‌లేని కేసీఆర్ స‌ర్కారు.. త‌మ త‌ప్పుల్ని కప్పి పుచ్చుకోవటానికే ఈ స‌భ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లుగా మండి ప‌డుతున్నారు. ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను తాజా స‌భతో క‌ప్పిపుచ్చాల‌న్న ప్ర‌య‌త్నాన్ని కేసీఆర్ చేస్తున్నార‌న్నారు.   ప్ర‌జ‌ల్లో పూర్తి స్థాయి వ్య‌తిరేక‌త రాక ముందే ముంద‌స్తుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న చేస్తున్న‌ట్లుగా అర్థ‌మ‌వుతుంద‌న్నారు.

అసెంబ్లీని ఎందుకు ర‌ద్దు చేస్తున్నారో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్న కేసీఆర్ కు.. ముంద‌స్తుగానే వాత పెట్టేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్న‌ట్లు  మాజీ మంత్రి డీకే అరుణ వ్యాఖ్యానించారు. మొత్తానికి భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్న ప్ర‌గ‌తి నివేద‌న స‌భ‌పై కాంగ్రెస్ నేత‌లు సైతం భారీగా రియాక్ట్ అవుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News