టీఆర్ఎస్-కాంగ్రెస్ మ‌ధ్య మంట పుట్టించిన మెట్రో

Update: 2017-11-26 18:18 GMT
హైద‌రాబాదీల‌కు తీపిక‌బురు అందిస్తున్న‌ మెట్రో రైలు ప్ర‌యాణం అధికార టీఆర్ఎస్ పార్టీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ల మ‌ధ్య మ‌రో పంచాయ‌తీకి కార‌ణ‌మ‌యింది. ప్ర‌ధాన‌మంత్రి  న‌రేంద్ర మోడీ చేతుల మీదుగా ఈనెల 28 మెట్రో ప్రారంభోత్స‌వానికి స‌ర్వం సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర పుర‌పాల‌క‌ శాఖ మంత్రి కేటీఆర్ మంత్రులు, న‌గ‌ర ప‌రిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో క‌లిసి శ‌నివారం మెట్రోలో టూర్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మెట్రో గురించి...ఇత‌ర‌త్రా అంశాల‌ను మంత్రి కేటీఆర్ వివ‌రించారు. అయితే ఈ ప‌రిణామ‌మే..ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ క‌స్సుమ‌నేందుకు కార‌ణం అయింది.

త‌మ హయాంలో ప్రారంభ‌మైన మెట్రోను అట్టహాసంగా తమ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన టీఆర్ఎస్‌, బీజేపీలు ప్రారంభిస్తున్న నేప‌థ్యంలో... హైద‌రాబాద్ మెట్రో క‌థాక‌మామిషు ఏంటో తెలియ‌జెప్పింది. ఏకంగా పార్టీ కార్యాల‌యంలో మెట్రో రైలు పవర్ పాయింట్ ప్రాజెక్టును ఇచ్చింది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి క‌లిసి మెట్రో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మెట్రో పూర్వాపరాలు వివరించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ  కాంగ్రెస్‌ పార్టీ దూరదృష్టి వల్లే హైదరాబాద్‌ మెట్రో ఏర్పడిందని తెలిపారు. మెట్రో కోసం పనిచేసింది తామైతే పేరు మాత్రం తనదిగా తెరాస ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ప్రాజెక్టు ప్రారంభానికి ప్రతిపక్షనేతను పిలవకపోవడం దారుణమని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలకు మెట్రో రైలు ప్రాజెక్టు పై నిజాలు చెప్పాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రయత్నం చేస్తున్నామ‌ని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు. 2007లో దివంగ‌త సీఎం వైఎస్‌ మెట్రో భవన్ కు శంకుస్థాపన చేశారని..2010న మెట్రో ఒప్పందం ..అగ్రిమెంట్ జరిగిందని గుర్తు చేశారు. 5ఏళ్లలో దీన్ని పూర్తిచేయాలని  అగ్రిమెంట్ జరిగిందని..2014 డిసెంబరు నాటికి మెట్రోరైలు ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. కేసీఆర్‌ చర్యల వల్ల ఆలస్యమైందని ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. పాతబస్తీలో మెట్రో రైల్‌ నిర్మాణం ఎందుకు ప్రారంభించలేదో కేసీఆర్‌ అక్కడి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మెట్రోకు అడ్డుపడ్డ వాళ్లే ఇప్పుడు తమ గొప్పగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
Tags:    

Similar News