కాంగ్రెస్ అంటే లైట్ తీస్కో ...?

Update: 2021-12-02 11:30 GMT
కాంగ్రెస్ ఈ దేశంలో శతాధిక వృద్ధ పార్టీ. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఈ దేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఏకచత్రాధిపత్యంగా ఏలింది. కాంగ్రెస్ కి సరిసాటి పార్టీ ఈ రోజుకు లేదు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రతీ పల్లెకూ ఆసేతు హిమాచలం తెలిసిన పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే. కేంద్రంలో రెండు మార్లు వరసగా అధికారంలోకి వచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ దక్షిణాదిన పెద్దగా ఎవరికీ తెలియని పల్లెలు కోకొల్లలు. ఇక మిగిలిన జాతీయ పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇంతకీ కాంగ్రెస్ పరిస్థితి ఈ రోజు ఎలా ఉంది అంటే కాస్తా గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటోంది.

అయితే అంతమాత్రం చేత కాంగ్రెస్ కంటే గొప్ప పార్టీలు ఏవీ జాతీయ స్థాయిలో లేవనే చెప్పాలి. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి నెట్టుకువస్తోంది. ఒకసారి పవర్ పోతే కమలం కూడా కమిలిపోకతప్పదు. మరి దేశంలో జాతీయ పార్టీల కాలం చెల్లుతోందా, ప్రాంతీయ పార్టీలదే రాజ్యమా అంటే అది అసలు ఈ దేశ పొలిటికల్ సెటప్ కి కుదరనే కుదరదు అని చెప్పాలి. దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో పార్టీకి ఆ రాష్ట్రంలోనే పలుకుబడి ఎక్కువ. కాస్తా పొలిమేర దాటి వస్తే ఎవరూ పట్టించుకోని సీన్ ఉంది. దీనికి తోడు చాలా ప్రాంతీయ పార్టీలకు తమ సొంత ఆకాంక్షలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టవన్న విమర్శలు ఉన్నాయి.

ఇందుకో అత్యధిక శాతం కుటుంబ పార్టీలు ఉన్నాయి. ఏక వ్యక్తి సారధ్యం, అంతర్గత ప్రజస్వామ్యం పూర్తిగా నిల్ ఇలా ప్రాంతీయ పార్టీలు సకల అవలక్షణాలతో సాగుతున్నాయి. కులం, మతం, ప్రాంతీయత, ఇతరత్రా అంశాలను హైలెట్ చేసుకుని కొనసాగుతున్న బాపతే ఎక్కువ. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల మీద అపుడే రీజనల్ పార్టీలు కన్నేశాయి. అటు బీజేపీ కాకుండా ఇటు కాంగ్రెస్ లేకుండా తామే రాజ్యం చేయాలన్నది ప్రాంతీయ పార్టీల ఆలోచన. ఇది ఒక విధంగా పాతదే. ఫెయిల్ అయినదే.

అపుడెపుడో 1989లో నేషనల్ ఫ్రంట్ అలా ప్రాంతీయ పార్టీలు, వాటికి సరిసమానమిన కొన్ని పేరుకు జాతీయ పార్టీల జట్టు కడితే గట్టిగా రెండు వందల సీట్లు రాలేదు. వీటికి బయట నుంచి బీజేపీ, వామపక్షాల మద్దతు ఇస్తే పదకొండు నెలలకే ఆ ప్రభుత్వం కూలిపోయింది. ఇక యునైటెడ్ ఫ్రంట్ 1996లో ఇలాంటి సీనే రిపీట్ అయింది. అపుడు కూడా జాతీయ పార్టీలు లేకుండా రాజ్యం చేద్దామనుకుంటే ప్రాంతీయ పార్టీలు భారం మోయలేక కుప్ప కూలిపోయయి.

ఇపుడు మరోసారి అలాంటి ప్రయోగానికి మమతా బెనర్జీ సమకడుతోంది. ఆమె బెంగాల్ లో వరసగా మూడవసారి గెలిచి మరీ సత్తా చాటింది. దాంతో ఆమెలో ప్రధాని ఆశలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఊపులో ఆమె దేశానికి తానే పెద్ద దిక్కు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఈ దేశంలో లేనే లేదు అంటూ మమత లైట్ తీసుకోవడం అంటే నిజంగా తమాషాగానే చూడాలి. కాంగ్రెస్ బీజేపీ లేని తృతీయ రాజకీయ వంటకానికి బెంగాల్ దీదీ రెడీ అయిపోతున్నారు.

ఆమె దృష్టిలో రాహుల్ కంటే తానే గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్న నేత అనుకుంటున్నారు. అయితే రాహుల్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ రోజుకీ దేశంలో బాగానే గుర్తింపు ఉంది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ గురించి తెలుసు. మరి తృణమూల్ కాంగ్రెస్ గురించి ఎవరికి తెలుసు. ఆ మాటకు వస్తే మమత గురించి ఈ దేశ ప్రజలకు ఎంతదాకా తెలుసు అన్న ప్రశ్నలు వస్తాయి. ఏది ఏమైనా మమత 2024లో ప్రధాని పీఠం పట్టేయాలని చూస్తున్నారు. ఆమెకు దేశంలోని ప్రాంతీయ పార్టీలు అన్నీ సహకరిస్తాయని నమ్మకంగా ఉన్నాయి.

అయితే ఈ రోజుకీ కాంగ్రెస్ నాయకత్వాన యూపీయె వైపు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉంటే బీజేపీ నాయకత్వాన ఎన్డీయే వైపు మరికొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. తటస్థ పార్టీలుగా టీయారెస్, వైసీపీ బిజూ జనతాదళ్ వంటివి ఉన్నాయి. అయినా ఇంత పెద్ద దేశానికి నాయకత్వం వహించాలి అంటే జాతీయ పార్టీల సహకారం లేకుండా కుదిరే పని కాదని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ ని వెంటపెట్టుకుని ప్రాంతీయ పార్టీలు ఏమైనా పోరాటం చేస్తే బీజేపీని ఓడించవచ్చు. అంతే తప్ప కాంగ్రెస్ లేదు మరేమీ లేదూ అంటూ వెటకారం మాటలు మాట్లాడితే మళ్ళీ అది బీజేపీ నెత్తిన‌ పాలు పోసినట్లు అవుతుంది. మరి ఈ సంగతి దీదీకి తెలియదు అనుకోగలరా.
Tags:    

Similar News