జీఎస్టీ బిల్లును మోడీ కూడా వ్యతిరేకించారట..

Update: 2016-08-30 07:37 GMT
ఒకే దేశం ఒకే పన్ను అంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రాలు కదులుతున్న తరుణంలో తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ సభ్యుడొకరు ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మోడీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారని చెప్పారు. అయితే... మోడీ దీన్ని ప్రధానిగా వ్యతిరేకించలేదని.. 2011లో గుజరాత్ సీఎంగా వ్యతిరేకించారని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ  శాసనసభలో సీఎం కేసీఆర్ జీఎస్‌ టీ బిల్లును ప్రవేశపెట్టిన అనంత‌రం కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి బిల్లుపై మాట్లాడారు. ఒకే దేశం ఒక ప‌న్ను విధానానికి బిల్లును 2011లోనే యూపీఏ ప్ర‌భుత్వం పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిందని ఆయ‌న గుర్తు చేశారు. రాజ‌కీయ పార్టీలు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ బిల్లు పాస్ కావ‌డానికి ఇన్నాళ్లు ప‌ట్టిందని ఆయ‌న అన్నారు.  గుజ‌రాత్ సీఎంగా ఉన్న‌ప్పుడు జీఎస్‌ టీ బిల్లుని ప్రస్తుత ప్రధాని మోడీ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు.

బిల్లుపై మాట్లాడుతున్న సందర్భంగా చిన్నారెడ్డి దేశ ఆర్థిక పరిస్థితిపైనా తనదైన విశ్లేషణ చేశారు. ఒకప్పుడు జీడీపీ ఆదాయంలో వ్య‌వ‌సాయం ప్ర‌థ‌మ‌స్థానంలో ఉండేద‌ని, రెండో స్థానం పారిశ్రామిక రంగానిద‌ని, మూడో స్థానంలో సర్వీస్ రంగం ఉండేద‌ని చిన్నారెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడ‌ది రివ‌ర్స్‌ అయిపోయిందని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇప్పుడు దాదాపు 60 శాతం ఆదాయం సేవారంగం ద్వారానే వ‌స్తోందని వివ‌రించారు. జీఎస్‌ టీ అమ‌ల‌యితే కొన్ని వ‌స్తువుల ధ‌ర‌లు తగ్గుతాయని, కొన్నింటి ధ‌ర‌లు పెరుగుతాయి. తెలంగాణ ప్ర‌భుత్వం సంక్షేమం - అభివృద్ధే రెండు క‌ళ్లుగా ముందుకెళ్లాల‌ని సూచించారు.  బిల్లుని స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆయన తెలిపారు.

టీఆరెస్ - బీజేపీ - కాంగ్రెస్.. ఇలా అందరి నుంచి మద్దతు లభించడంతో తెలంగాణ అసెంబ్లీలో జీఎస్టీ బిల్లుకు ఈ రోజు ఆమోదం దొరకనుంది. బిల్లు వల్ల కలిగే లాభ నష్టాలను బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి కూడా వివరించారు. బిల్లు సందర్భంగా సభలో హాజరు శాతం కూడా బాగానే కనిపించింది. అయితే... మోడీ కూడా దీన్ని వ్యతిరేకించారని చిన్నారెడ్డి చెప్పగానే అందరూ ఆసక్తిగా విన్నారు. ఆయన ఏమి చెబుతారా అని చెవులప్పగించారు.
Tags:    

Similar News