అధికారిపై చేప‌ విసిరి నిర‌స‌న తెలిపిన ఎమ్మెల్యే

Update: 2017-07-08 09:41 GMT
సాధార‌ణ‌గా త‌మ నిర‌స‌న‌ను తెలిపేందుకు గ‌ట్టిగ వాగ్వాదానికి దిగుతుంటారు. మ‌రికొందరు ఓ అడుగు ముందుకు వేసి ట‌మోటాలు - కోడిగుడ్లు విసురుతుంటారు. అయితే నిర‌స‌న‌లో ఇదో కొత్త ప‌ర్వం అనుకోవ‌చ్చు. ప్రభుత్వ ఉన్నతాధికారిపై విపక్షానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చేపను విసిరి త‌న అసంతృప్తిని చాటుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

మ‌హారాష్ట్రలోని తీర ప్రాంతమైన సింధుదుర్గ్ జిల్లా కన్‌ క్వాలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీశ్ రానే జాలర్ల సమస్యపై చర్చించేందుకు ఫిషరీస్ విభాగపు అడిషనల్ కమిషనర్ వద్దకు వెళ్లారు. జాలర్ల సమస్యపై చర్చిస్తుండగా ఒక్కసారిగా సహనం కోల్పోయిన ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే టేబుల్‌ పై ఉన్న‌ చేపల్లో ఒకదానిని తీసుకుని కమిషనర్ పైకి విసిరారు. దీంతో షాక్ తిన‌డం క‌మిష‌న‌ర్ వంతు అయింది. ఈ ఘటనపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. కమిషనర్ తన పక్షపాత బుద్ధిని ప్రదర్శిస్తూ ఆధిపత్యం చలాయిస్తున్న వ్యక్తుల పక్షాన నిలుస్తున్నాడంటూ ఆరోపించారు.

కాగా, కొంకణ్‌ తీర ప్రాంతంలో రెండు రకాల జాలర్లు ఉన్నారు. సాంప్రదాయ పద్ధతిలో చేపలు పట్టేవారు ఒకరు కాగా సాంకేతిక టెక్నాలజీతో చేపలు పట్టేవారు మరొకరు. ప్రభుత్వ నియమాల ప్రకారం ఇరు వర్గాల వారికి చేపలు పట్టే ప్రాంతాలు స్పష్టంగా విభజించబడి ఉన్నాయి. కాగా నియమాలను అతిక్రమిస్తూ ఆధునిక పద్ధతుల్లో చేపలుపట్టేవారు సాంప్రదాయ జాలర్ల ప్రాంతాల్లోకి చొరబడుతున్నారన్నారు. దీంతో వీరు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను విన్నవించి పరిష్కారం చూపాల్సిందిగా కోరేందుకు కమిషనర్ వ‌ద్ద‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళ్లిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే తాను స‌మ‌స్య‌ను విన్న‌విస్తుంటే క‌మిష‌న‌ర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎమ్మెల్యే ఆరోపించారు.
Tags:    

Similar News