కోల్ కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్..

2013 నాటి ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత దేశాన్ని ఊపేసిన ఉదంతం కోల్ కతా ఆర్జీ కర్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం.

Update: 2024-12-24 16:30 GMT

2013 నాటి ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత దేశాన్ని ఊపేసిన ఉదంతం కోల్ కతా ఆర్జీ కర్ ట్రైనీ డాక్టర్ హత్యాచారం. ఓ సాధారణ, బలహీన ఉద్యోగి ఆమెపై ఈ దురాఘతానికి ఒడిగట్టాడనే వార్త దేశమంతా కల్లోలం రేపింది. ఆ వైద్యురాలికి మద్దతుగా వైద్యులు ధర్నాలకు దిగడం, సేవలు నిలిపివేయడం, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో చర్చలు జరపడం.. ఇలా కొన్ని రోజుల పాటు తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కేసు సీబీఐకి చేరింది. ఆస్పత్రి సూపరింటెండెంట్ పైనా విచారణ జరిగింది.

ఇంతకూ నిందితుడు ఎవరు?

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడింది పోలీస్ వాలంటీర్ గా పనిచేసే సంజయ్ రాయ్ అని బాగా ప్రచారం జరిగింది. అయితే, విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ హత్యాచారంలో ఆర్జీ కర్ కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పాత్ర కూడా ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈయనను అరెస్టు కూడా చేశారు.

ఘటన ఎక్కడ జరిగింది?

ఆర్జీకర్ ఆస్పత్రిలో హత్యాచార ఘటన ఎక్కడ జరిగిందనేది తొలుత వస్తున్న ప్రశ్న. అయితే, పారిస్ ఒలింపిక్స్ లో జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఈవెంట్ ను చూశాక ట్రైనీ డాక్టర్ సెమినార్ హాల్ కు వచ్చారు. అక్కడే ఆమెపై సంజయ్ రాయ్ హత్యాచారం చేశాడు. అత్యంత దారుణంగా వ్యవహరించిన అతడు ఆ తర్వాత తాపీగా వెళ్లిపోయాడు. దీంతో సెమినార్ హాల్ చుట్టూనే ఇప్పటివరకు కేసు తిరిగింది. అయితే, ఇప్పుడు మరో మలుపు తీసుకుంది.

అక్కడ జరగలేదనే..

ట్రైనీ డాక్టర్ పై హత్యాచారం సెమినార్ హాల్లో జరగలేదని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఎన్నో అనుమానాలున్న ఈ కేసులో ఇది పెద్ద మలుపు. కాగా, సెమినార్ హాల్లో దురాగతం జరగలేదని తేల్చింది ఎవరో కాదు.. ఫోరెన్సిక్ రిపోర్ట్. డెడ్ బాడీ కనిపించిన హాల్లో అత్యాచారం, హత్యకు సంబంధించిన ఆధారాలు లభించలేదని ఈ రిపోర్టులో తేలింది. అంతేకాక సంజయ్ రాయ్ కు, బాధితురాలికి ఘర్షణ జరిగిన సాక్ష్యాలూ లభ్యం కాలేదని తేల్చింది. దీంతో హత్యాచారం సెమినార్ హాల్లోనే జరిగిందని ఎలా చెప్పగలమని ఫోరెన్సిక్ రిపోర్టు పేర్కొంది.

అదే నిజమైతే..

ఫోరెన్సిక్ రిపోర్టు నిజమైతే.. హత్యాచారం కేసు కీలక మలుపే. ఎందుకంటే ట్రైనీ డాక్టర్ పై దురాగతం అక్కడ జరగలేదనే ఓ బలమైన అనుమానం ఉంది. పైగా ఆర్జీ కర్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అంతేకాక ఆస్పత్రి పై దాడి కూడా జరిగింది. ఆధారాల ధ్వంసానికే ఇలా చేశారనే ఆరోపణలున్నాయి. మరిప్పుడు కేసు ఎక్కడకు వెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News