కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల హెచ్చరిక..!

Update: 2019-03-01 05:51 GMT
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి తేరుకోవడానికి పార్లమెంట్‌ ఎన్నికలు ఉపయోగపడుతాయని అనుకుంటున్న టీపీసీసీకి ఇప్పుడు కొత్త కష్టమొచ్చింది. ఆదివాసీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న డిమాండ్‌ పార్టీకి టెన్షన్‌ రేపుతోందట. ఇల్లందు నియోజకవర్గంలో ఎప్పుడూ ఆదివాసీకే టికెట్‌ ఇస్తూ వచ్చేది కాంగ్రెస్‌. కానీ గత ఎన్నికల్లో లంబాడీలకు ఇచ్చారు. ఇక్కడ పోటీ చేసిన హరిప్రియ విజయం కూడా సాధించారు. అయితే ఎప్పుడూ ఆదివాసీలకు కేటాయించిన టికెట్‌  ఈసారి లంబాడీలకు ఇవ్వడంతో ఆదివాసీలు అప్పటి నుంచే ఆగ్రహంతో ఉన్నారు.

మరోవైపు ఎస్టీ రిజర్వుడు ఎంపీ స్థానాలైనా ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌ టిక్కెట్లను ఆదివాసీలకు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందట..  దీంతో ఆదివాసీలు కూల్‌ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు నియోజకవర్గాలు ఆదివాసీలకు ఇస్తే నాలుగుచోట్ల విజయం సాధించారు. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని పినపాక నుంచి రేగ కాంతారావు గెలుపొందారు. అలాగే భద్రాచలంలో వీరయ్య విజయం సాధించారు. ములుగులో సీతక్క గెలుపొందారు. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఆసిఫాబాద్‌ లో ఆత్రం సక్కు విజయం సాధించారు.

2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, మహబూబాబాద్‌ సీట్లను లంబాడీలకే కేటాచించింది కాంగ్రెస్‌. ఈసారి కూడా లంబాడీలకే కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో రెండు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో గెలిచిన ఆదివాసీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారట. ఇచ్చిన హామీ ప్రకారం ఒక ఎంపీ స్థానం ఆదివాసీలకు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారట. ఎంపీ టికెట్‌ ఆదివాసీకి ఇవ్వకుంటే తాడోపేడో తేల్చేస్తామని ఆ ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.

దీంతో ఈ ఎమ్మెల్యేలపై టీఆర్‌ ఎస్‌ ఫోకస్‌ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సీతక్క, రేగ కాంతారావు, వీరయ్యతో పలు దఫాలుగా చర్చలు కూడా టీఆర్‌ ఎస్‌ జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏజెన్సీల్లో పట్టున్న వీరిని పార్టీలోకి తీసుకుంటే తమకు లాభిస్తుందని టీఆర్‌ ఎస్‌ లో చర్చ మొదలైందట. అయితే ఎంపీ టీకెట్‌ కేంద్రంగా సాగుతున్న ఈ జంపింగ్‌ ప్రక్రియ ఎక్కడికి దారి తీస్తుందోనని రకరకాలుగా అనుకుంటున్నారు. ఎన్నికల వేళ ఏజెన్సీ ఎమ్మెల్యే పార్టీలు మారితే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని పీసీసీ నేతల్లో ఆందోళన మొదలైందట.


Tags:    

Similar News