కాంగ్రెస్‌ ను చీల్చేందుకు హ‌రీశ్ ఎంట్రీ

Update: 2018-06-02 04:46 GMT
తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఆశించింది ఒక‌టైతే...ఆచ‌ర‌ణ‌లో జ‌రుగుతోంది మ‌రొక‌టి. పార్టీ బ‌లోపేతానికి తీసుకునే నిర్ణ‌యాలు అందుకు ఉప‌యోగ‌ప‌డ‌క‌పోగా పార్టీలో చీలిక‌ల‌కు దారితీస్తున్నాయ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పైగా ఇలాంటి ప్ర‌క్రియ‌కోసం రంగంలోకి దిగింది టీఆర్ ఎస్ ట్ర‌బుల్ షూట‌ర్ హ‌రీశ్‌ రావు కావ‌డంతో ఆ పార్టీలో క‌ల‌వ‌రం మొద‌లైంది. దీంతో కాంగ్రెస్ పెద్ద‌లు రంగంలోకి దిగార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదంతా తెలంగాణ‌కు చెందిన సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి నాగం జ‌నార్దన్ రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్న నేప‌థ్యంలో హ‌స్తం పార్టీలో చోటుచేసుకుంటోంది. నాగం రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన ఎమ్మెల్సీ దామోద‌ర్ రెడ్డి గులాబీ గూటికి చేర‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

విశ్వ‌సనీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నాగం చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ దామోదరరెడ్డి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. ఇప్పటికే మంత్రి హరీశ్‌ రావు ఆయన ఇంటికెళ్లి మంతనాలు జరిపినట్టు తెలిసింది. హ‌రీశ్ ఎంట్రీకి త‌గు కార‌ణాలు కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. చాలా కాలంగా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న నాగం...పార్టీలో చేరతారని తెలిసినప్పటి నుంచి దామోదరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయనకు ఎమ్మెల్యే డీకే అరుణ - ఎంపి నంది ఎల్లయ్య - ఇతర నాయకులు కూడా మద్దతు ఇచ్చారు. నాగంను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. నాగం రానున్న నేపథ్యంలో దామోదర్‌ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి - వంశీచంద్‌ రెడ్డి తప్పుపట్టారు. ఆయన వ‌ల్ల‌ పార్టీ బలోపేతం అవుతుందని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ పెట్టి మరి సమర్థించారు. కొంత మంది వ్యతిరేకించడం - మరికొంత మంది ఆహ్వానించచడంతో జిల్లా నేతలు రెండుగా చీలిపోయి బహిరంగ విమర్శలు చేసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ పార్టీకి చెందిన సీనియర్‌ నేత - కేంద్ర మాజీ మంత్రి మంత్రాంగం మేరకు రాహుల్‌ గాంధీ సమక్షంలో నాగం పార్టీలో చేరారు.

నాగం కాంగ్రెస్‌ పార్టీలో చేరే విషయాన్ని కూడా తనకు సమాచారం ఇవ్వకుండా రహస్యంగా పార్టీలో చేర్చుకున్నారని దామోదర్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. సొంత నియోజకవర్గానికి చెందిన తనకు ఏ మాత్రం చెప్పకుండా రాష్ట్ర నాయకత్వం తనను విస్మరించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ మారడం మినహా మరో మార్గం లేదని దామోదర్‌ రెడ్డి తన సన్నిహితుల వద్ద వాపోతున్నారు. ఈ స‌మ‌యంలోనే దామోద‌ర్ రెడ్డితో చాలా కాలం నుంచి సత్సబంధాలు కలిగిన టీఆర్ ఎస్‌ పార్లమెంటరీ పక్షనేత జిత్తేందర్‌ రెడ్డితో కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఆయన గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమమేననే ప్రచారం జరుగుతోంది. మ‌రోవైపు ఇప్పటికే తన అనుచరులు - కార్యకర్తలు - స్థానిక నాయకులతో ఆయన సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు.

కాగా, సిట్టింగ్ ఎమ్మెల్సీ పార్టీ మారుతున్నార‌నే ప‌రిణామం కాంగ్రెస్‌లో క‌ల‌వ‌రానికి దారితీసింది. దీంతో పార్టీకి చెందిన ముఖ్యనేతలు ఆయన్ను బుజ్జగిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - ఉపాధ్యక్షులు మల్లు రవి పలు దఫాలుగా ఆయనతో చర్చలు జరిపినట్టు తెలిసింది. అయినప్పటికీ దామోదర్‌ రెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దామోదర్‌ రెడ్డికి అండగా ఉన్న డికె అరుణ - నంది ఎల్లయ్య ఈ విషయంలో మౌనంగా ఉంటున్నారని, ఈ మౌనం దేనికి సంకేతమని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
Tags:    

Similar News