టీఆర్ఎస్ బాట‌లో కాంగ్రెస్‌!

Update: 2021-10-03 01:30 GMT
ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌.. ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం న‌డుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ఎంపికైన త‌ర్వాత రేవంత్ మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూ అధికార పార్టీ నాయ‌కులు ల‌క్ష్యంగా తీవ్ర విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా దీటుగా స్పందిస్తుండ‌డంతో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేస్తున్న కాంగ్రెస్‌.. తాజాగా ఓ విష‌యంలో మాత్ర‌మే ప్ర‌త్య‌ర్థి పార్టీ బాట‌లో సాగేందుకు సిద్ధ‌మైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ మాదిరే కాంగ్రెస్ కూడా విద్యార్థి నేత‌ను బ‌రిలో దించేందుకు రంగం సిద్ధం చేసింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

రాష్ట్ర రాజ‌కీయాల్లో అత్యంత కీల‌కంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక హ‌డావుడి మ‌రింత పెరిగింది. గ‌త రెండు మూడు నెల‌లుగానే ఈ ఉప ఎన్నిక‌తో రాజ‌కీయ ర‌ణ‌రంగం హోరాహోరీగా మార‌గా.. తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో ఆ సంద‌డి మ‌రింత ఎక్కువైంది. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్‌ను వీడి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేంద‌ర్‌.. క‌మలం త‌ర‌పున పోటీ చేసి త‌న స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక ఈట‌ల‌ను ఓడించి త‌న‌ను ఎదురించిన వాళ్ల‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్ లేద‌ని చాటి చెప్పాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న కేసీఆర్‌.. ఆ దిశ‌గా సాగుతున్నారు. ఇప్ప‌టికే ఆ పార్టీ త‌ర‌పున టీఆర్ఎస్‌వీ అధ్య‌క్షుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ నామినేష‌న్ వేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ త‌మ అభ్య‌ర్థి విష‌యంలో నాన్చిన కాంగ్రెస్‌.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డంతో ఈ ప్రక్రియ‌లో వేగం పెంచింది. కాంగ్రెస్ అనుబంధ భార‌త జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్‌యూఐ) రాష్ట్ర అధ్య‌క్షుడు బ‌ల్మూరి వెంక‌ట న‌ర్సింగ‌రావును హుజూరాబాద్‌లో పోటీకి దింపేందుకు పార్టీ సిద్ధ‌మైంది. ఆయ‌న పేరు దాదాపు ఖ‌రారైన‌ట్లు స‌మాచారం. నేడోరేపో అధికారికంగా ప్ర‌క‌టించే వీలుంది. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని ప్ర‌తిపాదిస్తూ టీపీసీసీ నుంచి ఇప్ప‌టికే అధిష్ఠానానికి ప్ర‌తిపాద‌న‌లు వెళ్లాయి. ఏఐసీసీ ఆమోదించ‌డ‌మే మిగిలింది. వెంక‌ట్‌తో పాటు స్థానిక నేత‌లు ర‌వీంద‌ర్ రెడ్డి, కృష్ణారెడ్డిల పేర్ల‌ను పంపించిన‌ప్ప‌టికీ విద్యార్థి సంఘం నాయ‌కుడు వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వెంక‌ట్ పేరు అధికారికంగా ఖ‌రార‌వుతుంద‌ని టీపీసీసీ వ‌ర్గాలు అంటున్నాయి.

హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఎవ‌రిని నిల‌బెట్టాల‌ని విష‌యంలో పెద్ద త‌తంగ‌మే న‌డించింద‌ని చెప్పుకోవాలి. వ‌రంగ‌ల్ నేత మాజీ మంత్రి కొండా సురేఖ‌ను బ‌రిలో దించాల‌ని రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నించారు. కానీ స్థానిక నేత‌ల‌కే అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీలోని ఇత‌ర సీనియ‌ర్లు ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఆశావ‌హుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించారు. తాజాగా సీత‌క్క‌ను అక్క‌డ నిల‌బెడ‌తారనే వ‌దంతులు వినిపించాయి. ఇవ‌న్నీ కాద‌ని ఇప్పుడు వెంక‌ట్ పేరును అధికారికంగా పార్టీ ప్ర‌క‌టిస్తుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆర్ఎస్ అక్క‌డ విద్యార్థి నేత శ్రీనివాస్ యాద‌వ్‌ను బ‌రిలో దింపిన నేప‌థ్యంలో.. కాంగ్రెస్ కూడా విద్యార్థి నేత‌నే పోటీకి సిద్ధం చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క ఈ ప్ర‌తిపాద‌న చేయ‌గా.. రేవంత్ కూడా అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌లేద‌ని తెలిసింది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌కు చెందిన వెంక‌ట్ 2018లో రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ విద్యార్థి సంఘాన్ని ప‌రుగులు పెట్టించి క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. మంత్రి మ‌ల్లారెడ్డి అవినీతి విష‌యంలో ఆందోళ‌న‌లు చేసి కేసుల్లో చిక్కుకున్నారు. క‌రోనా త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల్లోనూ విద్యార్థుల స‌మ‌స్య‌పై ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో వెంక‌ట్ అయితేనే గ‌ట్టి పోటీ ఇచ్చే ఉద్దేశ‌ముంద‌ని పార్టీ భావించిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News