బీజేపీకి భారీ షాక్‌..మ‌హారాష్ట్రలో కాంగ్రెస్ వ్యూహం..సేన‌ -ఎన్సీపీల‌తో స‌ర్కారు..!

Update: 2019-10-31 11:46 GMT
మ‌హారాష్ట్ర‌లో ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీలు స‌హాప్రాంతీయ పార్టీల‌కు దేనికీ కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ రాలేదు. దీంతో ఇక్కడ ప్ర‌భుత్వ ఏర్పాటు విష‌యం చాలా చాలా ఆస‌క్తికరం గా మారిపోయింది. మొత్తం 288 సీట్లున్న అసెంబ్లీలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే మేజిక్ మార్క్ 145 సీట్లు రావాలి. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న బీజేపీకి 105 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. అదే స‌మయంలో బీజేపీ మిత్ర‌ప‌క్ష శివ‌సేన 56 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. మ‌రో ప్రాంతీయ పార్టీ ఎన్సీపీ 54 - మ‌రొ జాతీయ పార్టీ కాంగ్రెస్ 44 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. ఇక‌, బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగ ప‌డిన వారు రెబ‌ల్స్‌ గా పోటీ చేశారు.

వీరిలో 17 మంది విజ‌యం సాధించారు. అయితే, నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు అధికారంలో ఉన్న మిత్ర‌ప‌క్షాలు బీజేపీ-శివ‌సేన‌లు అధికారం కోసం కీచులాడుకుంటున్నాయి. సీఎం - డిప్యూటీ సీఎం ప‌ద‌వులు - ప‌ద‌వుల్లో ఫిఫ్టీ-ఫిఫ్టీ అంటూ.. ఈ రెండు పార్టీల మ‌ధ్య తీవ్ర ఫైట్ సాగుతోంది. బీజేపీ ఎట్టి ప‌రిస్థితిలోనూ సీఎం సీటును వ‌దులు కునేందుకు సిద్ధంగా లేక పోవ‌డంతో శివ‌సేన కూడా ఇదే సీటును త‌మ‌కు రెండున్న‌ర సంవ‌త్సరాలు త‌మ‌కే క‌ట్ట‌బెట్టాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఇక్క‌డి రాజ‌కీయాలు ర‌స‌కందాయంగా మారాయి. ఈ ప‌రిణామాల‌ను చాలా నిశితంగా గ‌మ‌నించిన కాంగ్రెస్‌.. బీజేపీకి చెక్ పెట్టేలా.. ఓ వ్యూహాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తాజాగా తెలుస్తోంది.

105 సీట్లు వ‌చ్చిన బీజేపీని ప‌క్క‌న పెట్టి.. సేన‌ - ఎన్సీపీల‌తో జ‌ట్టుక‌ట్టి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తే..బాగుం  టుంద‌ని ఈ పార్టీ సంచ‌ల‌న విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది. సీఎం పీఠాన్ని శివ‌సేన‌కే అప్ప‌గిస్తామ‌ని కాంగ్రెస్ ఇప్ప‌టికే రాయ‌బారం కూడా పంపింది. ఇక‌, కాంగ్రెస్ స‌మీక‌ర‌ణ‌ల‌ను ఎన్సీపీ కూడా స్వాగ‌తించింది. కాంగ్రెస్ 44 - ఎన్సీపీ 54 - శివ‌సేన 56 సీట్లు సంపాయించుకోవ‌డంతో ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని ఏక‌తాటిపైకి వ‌స్తే.. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం సునాయాస‌మేన‌ని ప‌రిశీల‌కులు కూడా అంటున్నారు. ఈ మూడు పార్టీల బ‌లం మెజారిటీ మార్కు 145ను మించిపోయిన నేప‌థ్యంలో బీజేపీ కూడా చేయ‌గ‌లిగింది ఏమీ ఉండ‌ద‌ని చెబుతున్నారు.

ఇక దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తాను మ‌ళ్లీ మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఐదేళ్ల పాటు ఉంటాన‌ని చెపుతుండ‌గా.... అందుకు శివ‌సేన వేగంగా పావులు క‌దుపుతూ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం నిర్వహించింది. ఆ పార్టీ సీనియర్‌ నేత - ఏక్‌ నాథ్‌ షిండేను శివసేన శాసనసభాపక్ష నేత ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తమ ఎమ్మెల్యేతో ఈరోజు సాయంత్రం 3:30 గంటలకు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ ను కలువనున్నారు. ఒక‌వేళ వీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామ‌ని.. అందుకు ఛాన్స్ ఇవ్వాల‌ని గ‌వ‌ర్న‌ర్‌ ను కోరితే మ‌హా రాజ‌కీయం మ‌రింత హీటెక్కుతుంది.

మ‌రోవైపు ఫ‌డ్న‌వీస్ రెండోసారి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆయ‌న్ను ఇప్ప‌టికే బీజేపీ ఎమ్మెల్యేలు త‌మ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా ఎన్నుకున్నారు. బీజేపీ దిగ‌క‌పోవ‌డంతో శివ‌సేన మ‌రింత ప‌ట్టుద‌ల‌కు పోతోంది. మ‌రి ఈ ఇద్ద‌రు మిత్రుల్లో ఎవ‌రైనా రాజీ ప‌డ‌తారా ?  లేదా మ‌హా రాజకీయం ఎలా ట‌ర్న్ అవుతుందో ?  చూడాలి. 
Tags:    

Similar News