అదిరేలా విలీన‌ నేత‌ల ఎదురుదాడి!

Update: 2019-06-13 06:55 GMT
కొన్ని ప్రాంతాల మ‌హిమ అంటూ భ‌లే విష‌యాలు చెబుతుంటారు. కొన్ని ప్రాంతాల‌కు వెళ్ల‌గానే.. అక్క‌డి గాలి మ‌హిమతో నోట మాట రాన‌ట్లుగా ఉండేటోళ్లు కూడా మాట్లాడేస్తుంటారు. టీఆర్ఎస్ లో ఇటీవ‌ల విలీన‌మైన కాంగ్రెస్ నేత‌ల తాజా తీరు చూస్తే ఇదే తీరు క‌నిపించ‌క మాన‌దు. కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు మాట్లాడ‌టానికి నోరు పెగ‌ల‌ని కొంద‌రు నేత‌లు.. తాజాగా తాము విలీన‌మైన తీరును త‌ప్పు ప‌డుతున్న దానికి పంచ్ లు వేస్తూ చేసిన ఎదురుదాడి చూస్తే.. ఇన్నాళ్లు ఈ గొంతులు ఏమైపోయాయి? అన్న సందేహం క‌లుగ‌క మాన‌దు.

తాము అమ్ముడుపోయిన‌ట్లుగా కాంగ్రెస్ నేత‌లు ఎద‌రుదాడి చేస్తూ.. నిర‌స‌న‌లు చేప‌ట్టిన వేళ‌.. విలీన నేత‌లే స్వ‌యంగా రంగంలోకి దిగారు. త‌మ‌ను త‌ప్పు ప‌డుతున్న కాంగ్రెస్ నేత‌ల‌పై ఎదురుదాడి షురూ చేశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన అన్ని ఎన్నిక‌ల్లో ఓట‌ములు చవి చూస్తున్న వేళ‌.. అస‌లేం జ‌రుగుతోంది?  లోపం ఎక్క‌డ ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించ‌టం పోయి త‌మ‌ను త‌ప్పు ప‌ట్ట‌టం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురాకుంటే తాను త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని చెప్పిన ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట మీద ఎందుకు నిల‌బ‌డ‌టం లేదంటూ కొత్త లాజిక్ ను తెర మీద‌కు తెచ్చారు. ఉత్త‌మ్ వైఫ‌ల్యాల్ని చెప్పి చెప్పి తాము విసిగిపోయి.. త‌మ దారి తాము చూసుకున్న‌ట్లుగా చెప్పారు. త‌మ‌కు వ‌చ్చే నోటీసుల‌కు కోర్టులోనే స‌మాధానం చెబుతామ‌ని చెప్పిన వారు.. ఏ స్థాయిలో పోరాటానికైనా తాము సిద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదంతా ఓకే కానీ.. ఈ ఎపిసోడ్ లో ఆణిముత్యం లాంటి మ‌రో మాట‌ను చెప్పుకొచ్చారు. త‌మ‌పై విమ‌ర్శ‌ల దాడి అదే ప‌నిగా చేస్తే.. తామంతా క‌లిసి ప‌రువున‌ష్టం దావా వేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. తాము అమ్ముడు బోయిన‌ట్లుగా కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న విమ‌ర్శ‌ల్ని త‌ప్పు ప‌ట్టిన విలీన నేత‌లు.. తామేమీ గొర్రెలం.. బ‌ర్రెలం కాద‌న్నారు.

భూపాల‌ప‌ల్లి అధ్య‌క్ష ప‌ద‌వికి త‌న స‌తీమ‌ణి రాజీనామా చేసి జెడ్పీటీసీగా పోటీ చేస్తే.. ఆమె నిర్ణ‌యం స‌రైన‌దేనంటూ 10,500 ఓట్ల మెజార్టీతో ఓట‌ర్లు గెలిపించారంటూ  చెప్పుకొచ్చారు గండ్ర‌. తాను టీఆర్ ఎస్ త‌ర‌ఫున ప్ర‌చారం కూడా చేయ‌లేద‌ని.. అవ‌స‌ర‌మైతే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి మ‌రీ గెలుస్తామ‌ని స‌వాల్ విసిరారు. ఆ ప‌నే చేసి ఉంటే.. ఈ లొల్లి ఉండేది కాదుగా?  ఏమైనా టీఆర్ ఎస్ కండువా క‌ప్పుకోగానే.. గొంతులో కొత్త హుషారు విలీన నేత‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News