కేంద్ర‌మంత్రి బ‌ర్త్‌ డే ఖ‌ర్చు 20 కోట్లు​

Update: 2015-12-09 15:47 GMT
కేంద్ర రక్షణ మంత్రి - గోవా మాజీ సీఎం మనోహర్‌ పారికర్ 60వ జన్మదిన వేడుకలు వివాదంగా మారాయి. డిసెంబర్‌ 13న జరిగే ఆయన బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్‌గా నిర్వహించేందుకు గోవా రాష్ట్ర బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. 50,000 మంది అతిథులను ఆహ్వానించేందుకు సన్నాహాలు చేస్తోంది. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇంత భారీ ఎత్తున జన్మదిన వేడుకలు జరపడంపై గోవా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు అభ్యంతరం తెలుపుతున్నారు. ఒక వైపు ప్రధాని నరేంద్ర మోడీ సాధారణ జీవితానికి ప్రాధాన్యతను ఇవ్వండని పిలుపునిస్తుంటే ....ఇక్కడి నేతలు దుబారాగా ఖర్చు చేయడానికి సిద్ధమ‌వుతున్నారని గోవా కాంగ్రెస్‌ నాయకులు మండిపడుతున్నారు.

గోవా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు ప్రధాని మోడీ విలువలకు వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ నేత‌లు అభిప్రాయపడుతున్నారు. దేశంలో పరిస్థితులు కూడా విషాదంగా ఉన్న ప్రస్తుత సమయంలో ఇంత భారీగా ఖర్చు చేసి జన్మదిన వేడుకలు జరపాల్సిన అవసరం లేదని వారు భావిస్తున్నారు. ఒక వైపు దేశ సరిహద్దు వెంబడి పరిస్థితులు ఉద్రిక్తంగా ఉండ‌గా...మరోవైపు వరదల కారణంగా చెన్నైలో పరిస్థితి అతి దారుణంగా ఉంది. ఇటువంటి సమస్యలు దేశంలో ఉండగా గోవా బీజేపీ నాయకులు మొండిగా వ్యవహరిస్తున్నారని... స‌మాజం కోసం ఆలోచించాల‌ని చెప్పిన మాటలను పెడచెవిన పెడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. అందుకే నేరుగా ప్రధాని నరేంద్ర‌మోడీని కలిసి బీజేపీ రాష్ర్ట నేత‌ల‌ను క‌ట్ట‌డి చేయాల‌ని విన‌తిత‌ప్రం సమర్పించారు. గోవాలో జ‌రుగ‌తున్న విషయాలను కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రధాని కల్పించుకుని ఈ వేడుకలను ఆపాలని వారు కోరారు. గోవా కాంగ్రెస్‌ పార్టీ నేత‌లు విన‌తి ప‌త్రం ఇచ్చిన సంద‌ర్భంగా వారితో మోడీ మాట్లాడుతూ...తాను జోక్యం చేసుకుంటాన‌ని మోడీ హామీ ఇచ్చార‌ట‌. ఈ మేర‌కు కాంగ్రెస్ నేత‌లు మీడియాకు తెలిపారు.

ఇంత కాలం బీజేపీ ఎంపీలు, నాయ‌కులు వివాదాస్ప‌ద కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలువ‌గా ఇపుడు జ‌న్మ‌దిన సంబ‌రాల‌తో తెర‌మీద‌కు రావ‌డం ఆ పార్టీని ఇరుకుపెట్ట‌డంగా భావిస్తున్నారు. స‌మ‌ర్థుడైన సీఎంగా పేరున్న మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సింద‌ని బీజేపీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News