రాజ‌గోపాల్ కోరుకున్న‌ట్లే చేస్తున్న కాంగ్రెస్‌!

Update: 2019-06-20 04:49 GMT
కాలిపోయే వ‌ర‌కూ చూస్తుండిపోయి.. ఉలిక్కిప‌డి లేచిన‌ట్లుగా న‌టించ‌టం వ‌ల్ల ఏమైనా ప్ర‌యోజ‌నం ఉంటుందా?  తెలంగాణ కాంగ్రెస్ విష‌యంలో కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం ఇప్పుడు ఇలానే వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీ గీత దాటే నేత‌ల మీద ముందు నుంచే కొర‌డా విదిల్చ‌టం లాంటివి చేయాల్సిన‌ప్ప‌టికీ.. అన‌వ‌స‌ర మొహ‌మాటాల‌కు పోయి.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా షోకాజు నోటీసులు జారీ చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌నుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి తాజాగా పీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణాసంఘం షోకాజు నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్య‌తిరేక చ‌ర్య‌ల‌తో పాటు దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన నేరాభియోగాన్ని ఆయ‌న‌పై మోపారు. ప‌ది రోజుల్లో తామిచ్చిన షోకాజు నోటీసుల‌కు బ‌దులు ఇవ్వాల‌ని.. లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌లో టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయం కాంగ్రెస్ కాద‌ని.. బీజేపీనేన‌న్న రాజ‌గోపాల్ వ్యాఖ్య‌ల్ని పీసీసీ తీవ్రంగా త‌ప్పు ప‌డుతోంది. కుంతియా.. ఉత్త‌మ్ ల‌ను దూషించిన నేరారోప‌ణ‌ను రాజ్ గోపాల్ మీద మోపింది. నోటీసులు జారీ చేయ‌టం ద్వారా లేని బింకాన్ని కాంగ్రెస్ ప్ర‌ద‌ర్శిస్తుంటే.. రాజ‌గోపాల్ ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ అదే చేసింద‌న్న మాట వినిపిస్తోంది.

త‌న‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుకు దిమ్మ తిరిగేలా బ‌దులివ్వ‌టం.. ఆయ‌న‌పై చ‌ర్య‌కు కాంగ్రెస్ ఉప‌క్ర‌మించిన వెంట‌నే.. రాజ‌గోపాల్ త‌న దారి తాను చూసుకుంటార‌ని చెబుతున్నారు. ఎలా అయినా పార్టీ మారాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న రాజ‌గోపాల్ కు త‌గ్గ‌ట్లే కాంగ్రెస్ తీరు ఉండ‌టం గ‌మ‌నార్హం. తాజా షోకాజ్ నోటీస్ ఎపిసోడ్ తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త అల‌జ‌డికి కార‌ణ‌మ‌వుతుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.


Tags:    

Similar News