ఏపీలో బాబుకు షాకిచ్చిన‌ట్లే..గోవాలోనూ రిపీట్ చేశారు!

Update: 2019-07-11 04:25 GMT
విలువ‌ల్ని పాతేయ్. సంప్ర‌దాయాల్ని స‌మాధి చేయ్. ప్ర‌త్య‌ర్థిని నిలువునా దెబ్బేయ్. అధికారం ముందు మ‌రేవీ ముఖ్యం కాద‌న్న‌ట్లుగా మారింది ప్ర‌స్తుత రాజ‌కీయం.  తెలంగాణ‌లో కేసీఆర్ ఏ రీతిలో అయితే.. త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల ఉనికి ప్ర‌శ్నార్థ‌కం చేశారో.. ఈ మ‌ధ్య‌న టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల విష‌యంలో బీజేపీ అధినాయ‌క‌త్వం వ్య‌వ‌హ‌రించిందో.. సేమ్ టు సేమ్ అన్న రీతిలో గోవాలో మ‌రోసారి రిపీట్ చేశారు క‌మ‌ల‌నాథులు.

గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన మొత్తం 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఏకంగా 10 మంది బీజేపీలో చేరారు. మూడింట రెండొంతుల మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం చేసుకోవ‌టంతో పార్టీ చీలిక ఇప్పుడు చ‌ట్ట‌బ‌ద్ధ‌మైంది. గోవా రాజ‌కీయం నిన్న (బుధ‌వారం) అనూహ్య మ‌లుపు తిరిగింది. విప‌క్ష నేత చంద్ర‌కాంత క‌వ్లేక‌ర్ నేతృత్వంలో ప‌ది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

గోవా స్పీక‌ర్ ను క‌లిసిన చీలిక బృందం తాము కాంగ్రెస్ పార్టీని వ‌దిలేసి.. బీజేపీలో చేర‌నున్న‌ట్లుగా పేర్కొంటూ అందుకు సంబంధించిన లేఖ‌ను అందించారు. స్పీక‌ర్ అందుకు ఓకే చేయ‌టంతో చీలిక ఎమ్మెల్యేలంతా బీజేపీ ఎమ్మెల్యేలుగా మారారు. ఇదే విష‌యాన్ని క‌న్ఫ‌ర్మ్ చేసిన చందంగా గోవా ముఖ్య‌మంత్రి ప్ర‌మోద్ సావంత్ మాట్లాడుతూ ఇక నుంచి బీజేపీ చీలిక ఎమ్మెల్యేలు ప‌దిమంది త‌మ పార్టీలో చేరాన‌ని.. ఇక‌పై వారంతా బీజేపీ ఎమ్మెల్యేలుగా స‌ర్టిఫికేట్ ఇచ్చేశారు.

గోవా అసెంబ్లీలో మొత్తం 40 నియోజ‌క‌వ‌ర్గాలు ఉండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కూ 17 సీట్ల‌తో బీజేపీ పెద్ద పార్టీగా ఉంది. అధికార పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టేలా విప‌క్ష కాంగ్రెస్ కు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గోవా ఫార్వ‌ర్డ్ పార్టీకి ముగ్గురు.. మ‌హారాష్ట్ర వాదీ గోమంత‌క్ పార్టీ.. ఎన్సీపీల‌కు చెరో ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో.. కాంగ్రెస్ కున్న ఎమ్మెల్యేలు అధికార బీజేపీకి త‌ర‌చూ స‌వాల్ విసిరే ప‌రిస్థితి. దీంతో.. బీజేపీ ప్ర‌భుత్వం ఎప్పుడు మునుగుతుందో అర్థం కానట్లుగా ఉండేది.

తాజా ప‌రిణామంతో గోవా అసెంబ్లీలో బీజేపీ బ‌లం ఒక్క‌సారిగా 27కు పెరిగిపోవ‌టంతో.. ఇక అధికారానికి ఎలాంటి ఢోకా లేన‌ట్లుగా మారింది. ఇలా చీలిక‌ల్ని ప్రోత్స‌హించే అధికారప‌క్షం కార‌ణంగా.. వివిధ రాష్ట్రాల్లో విప‌క్షాల అడ్ర‌స్ గ‌ల్లంతు అయ్యే ప‌రిస్థితి. ఈ త‌ర‌హా రాజ‌కీయంతో అధికార‌పక్ష‌మే త‌ప్పించి విప‌క్ష‌మే లేని ప‌రిస్థితి ఇప్పుడు ఏర్ప‌డుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొద‌లైన ఈ త‌ర‌హా రాజ‌కీయం గోవాకు పాక‌ట‌మే కాదు.. రానున్న కొన్నేళ్ల‌లో మ‌రిన్ని రాష్ట్రాల‌కు వ్యాప్తిస్తోంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News