తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం?

Update: 2022-08-05 04:34 GMT
 కరోనా పీడ పోయిందని అందరూ మాస్కులు తీసేసి ఆహ్లాదంగా విహరిస్తున్న వేళ మళ్లీ ఆ మహామ్మారి కోరలు చాస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కోవిడ్ -19 భారతదేశంలోని అనేక ప్రాంతాలలో మళ్లీ వ్యాప్తి చెందుతోంది.   దేశంలో కొత్త కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి.తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఉధృతి పెరుగుతోంది. అదే సమయంలో వైరస్ కారణంగా మరణాలు పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ చాపకింద నీరులా ఇది విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జూన్ తొలినాళ్లలో ఒక శాతానికి మించని పాజిటివిటీ రేటు.. ఇప్పుడు దాదాపు మూడు శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 1000 మార్క్ దాటడం కలకలం రేపుతోంది.

గడిచిన 24 గంటల్లోనే 43318మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1061 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం మహహ్మారి నుంచి 836 మంది బాధితులుపూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.  ప్రస్తుతం రాష్ట్రంలో 6357 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా హైదరాబాద్ లో 401 కేసులు, రంగారెడ్డిలో 63, మేడ్చల్ మల్కాజిగిరిలో 56, నల్గొండ 51, రాజన్న సిరిసిల్ల 46, కరీంనగర్ 43 కొత్త కేసులు నమోదయ్యాయి.

మరోవైపు నల్గొండ జిల్లాలోని కస్తూర్బా పాఠశాలలో 17 మందికి కరోనా సోకింది. ఓ ఉపాధ్యాయురాలితోపాటు 16 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.

ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు కనిపిస్తే తప్పక నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో కోవిడ్ మరణాలు సున్నాగా ఉండడం కొంత ఊరట కలిగిస్తున్న అంశం.

కోవిడ్ వ్యాక్సిన్ ల ప్రభావం.. గతంలో వైరస్ సోకిన వారిలో యాంటీబాడీల ఉత్పత్తి వంటి అంశాలు కోవిడ్మరణాలను కొంతవరకూ నియంత్రిస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అంచనావేస్తోంది.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా మరోసారి సోకకుండా ఇది రక్షణ ఇస్తుందని చెబుతున్నారు.
Tags:    

Similar News