కరోనా కంట్రోల్... అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ బెటర్

Update: 2020-03-06 14:30 GMT
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను కంట్రోల్ చేసే విషయంపై ఇటు ప్రభుత్వాలతో పాటు అటు శాస్త్రవేత్తలు కూడా తలలు పట్టుకుంటున్న వైనం చూస్తున్నదే. అందుబాటులో ఉన్న సాంకేతికత, సామాగ్రితోనే ఎలాగోలా కరోనాను కంట్రోల్ చేసేందుకు నానా తంటాలూ పడుతున్న వైనం కూడా తెలిసిందే. అయితే ఇలా ప్రాణాంతక వైరస్ గా పేరుపడిపోయిన కరోనాను తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ చేస్తున్న తీరు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందట. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆరో, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆరో చెప్పినది కాదు. సాక్షాత్తు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పిన మాట ఇది. కరోనాను కంట్రోల్ చేసే విషయంలో తెలంగాణ అనుసరిస్తున్న చర్యలు బాగున్నాయని, దేశంలోని రాష్ట్రాలన్నీ తెలంగాణ అనుసరిస్తున్న చర్యలను ఫాలో అయితే సరిపోతుందని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనాపై శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కరోనా కంట్రోల్ కోసం రాష్ట్రాల్లో చేపడుతున్న చర్యలను సమీక్షించిన సందర్బంగా హర్షవర్ధన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం 60కి పైగా దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ వైరస్ ప్రస్తుతం భారత దేశంలోనూ వ్యాపిస్తుంది. భారతదేశంలో వందల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆస్పత్రుల్లో ఉన్నారు. వెరసి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా భారత్‌లో శుక్రవారం మరో కరోనా కేసు నమోదయింది. కరోనా వైరస్ పాజిటివ్ గా ఒక వ్యక్తి రిపోర్ట్స్ నిర్ధారించటం తో భారత్ లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 31కి చేరింది. ప్రస్తుతం అతనికి ఢిల్లీలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అన్ని రాష్ట్రాల మంత్రులతో చర్చించారు . ఇక ఈ వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణా రాష్ట్రం కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కొనియాడారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణా తరహాలో చర్యలు చేపట్టాలని సూచించారు.

ఈ సమీక్షలో తెలంగాణ తరఫున తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి, కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ యోగితా రాణాలు హాజరయ్యారు. తెలంగాణా రాష్ట్రంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని వారు కేంద్ర మంత్రికి వివరించారు.
కరోనా వ్యాప్తి చెందకుండా తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు సవివరంగా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి, నమోదైన కేసులు... తదితర అంశాలపై కేంద్ర మంత్రికి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ కోవిడ్-19ను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తుందని చెప్పారు. మిగతా రాష్ట్రాలు కూడా తెలంగాణాను అనుసరించాలని హర్షవర్ధన్ సూచించారు. కరోనా వైరస్ విషయంలో ఎన్‌-95 మాస్క్‌లను అందించాలని, మరో కరోనా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఈటెల కేంద్రాన్ని కోరారు.



Tags:    

Similar News