ఏపీ స్కూళ్లకు కరోనా భయం: పెరుగుతున్న కేసులు

Update: 2021-09-05 09:30 GMT
ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈనెల 16 నుంచి విద్యాసంస్థలను ప్రారంభించిన తరువాత మొదట్లో పాఠశాలలకు విద్యార్థులు హాజరు కాలేదు. ఆ తరువాత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను స్కూళ్లకు పంపించారు. అయితే రాను రాను విద్యాసంస్థల్లో కేసులు పెరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా ఓకే పాఠశాలలో 19 మందికి కొవిడ్ సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రభుత్వం ప్రత్యక్ష తరగతులను కొనసాగించాలా..? వద్దా..? అని పునరాలోచనలో పడింది.

కరోనా కేసులు నెల్లూరు జిల్లాలో పెరుగుతూ పోతున్నాయి. ఇక్కడి కోట మండలం చిట్టేడు గ్రామంలోని గురుకుల పాఠశాలలో 19 మంది విద్యార్థులకు కరోనా నిర్దారణ అయింది. ఓ టీచర్ కుడా వైరస్ సోకింది. దీంతో పిల్లల్ని గూడూరు ప్రభుత్వ ఆసుత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇదే జిల్లాలోని మనుబోలు మండలంలోని ఎలిమెంటరీ హైస్కూల్ లో నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. గుంటూరు జిల్లాలో మొత్తం 10 మందికి నిర్దారణ అయింది.

గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంలో రెండు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు, ఓ టీచర్  వైరస్ బారిన పడ్డారు. అయితే గురుకులాల్లోనే ఎక్కువ కేసులు నమోదు కావడం ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు జాగ్రత్తలు పాటించి పాఠశాలలు ప్రారంభించినా కేసుల పెరుగుదల కొనసాగుతుండడంతో అక్కడక్కడా పాఠశాలలను మూసి వేస్తున్నారు. దీంతో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను కూడా రద్దు చేశారు. గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.

తెలంగాణలోనూ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే గురుకుల, హాస్టళ్లలో ప్రత్యక్ష తరగతులకు మాత్రం హైకోర్టు అనుమతి ఇవ్వలేదు. దీంతో పాఠశాలల్లో మాత్రమే క్లాసులు నడుస్తున్నాయి. మరోవైపు పాఠశాలలకు విద్యార్థులను పంపడం తల్లిదండ్రు ఇష్టానికే వదిలేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు ఎక్కువగా స్కూళ్లకు రావడం లేదు. దీంతో ఇక్కడ కేసులు ఇప్పటి వరకైతే నమోదు కాలేదు.

అయితే ఏపీలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా విద్యాసంస్థలన్నీ ప్రారంభించడంతో కొన్నిచోట్ల జాగ్రత్తలు తీసుకోవడం కష్టమవుతుందని కొందరు అంటున్నారు. ముఖ్యంగా గురుకులాల్లో భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ చేయడం కష్ట సాధ్యమవుతుందని తెలుపుతున్నారు. అందుకే గురుకులాల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతున్న స్కూళ్లను మూసివేస్తోంది. అయితే కరోనా కేసులు ఇలాగే పెరిగితే ప్రత్యక్ష తరగతులు కొనసాగడం అనుమానమేనంటున్నారు.

సెకండ్ వేవ్లోనూ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నా కేరళలో మాత్రమే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పుడు ఏపీలో మెల్లగా కేసులు పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ కంటే ముందు పాఠశాలలను ప్రారంభించడంతో కేసులు నమోదయ్యాయి. ఈసారి కూడా కేసులు పెరుగుతుండడంతో మరోసారి అన్ లైన్ క్లాసులే నిర్వహిస్తారా..? అన్న చర్చ ప్రారంభమైంది. అయితే ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థుల భవిష్యత్ ఏంటనే ప్రశ్నకూడా ఎదురవుతోంది. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

అక్టోబర్లో థర్డ్ వేవ్ ఉండొచ్చని వైద్య నిపుణులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ శాస్త్రవేత్త స్వామినాథన్ భారత్ లో కరోనా ఎండమిక్ స్టేజిలో ఉందని భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది. దీంతో చాలా రాష్ట్రాల్లో పాఠశాలలను ప్రారంభించారు. అయితే ఇప్పుడు కరోనా సోకిన విద్యార్థులలకు కూడా లక్షణాలు ఉన్నా మరణాలు ఎక్కడా సంభవించలేదు. దీంతో అవి కరోనా కేసులేనా..? లేక వైరల్ ఫ్లూ జ్వరాలా..? అనేది తెలియకుండా ఉంది. ఏదీ ఏమైనా ఏపీలో మరోసారి కరోనా భయం పట్టుకుంది.
Tags:    

Similar News