దేశాధినేతలకు షాకిచ్చిన కరోనా.. గ్రూప్ ఫోటో అలా మారింది

Update: 2021-06-12 13:30 GMT
దేశాధినేతలు కలవటం కాస్త తక్కువే. అందునా యూకే.. అమెరికా.. కెనడా.. ఫ్రాన్స్.. జర్మనీ.. ఇటలీ.. జపాన్ లాంటి సంపన్న దేశాలకు చెందిన దేశాధినేతలు హాజరుకావటం తక్కువే. వీరికి తోడుగా అతిధ్య దేశాలుగా భారత్ (మోడీ వర్చువల్ గా పాల్గొంటున్నారు).. దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియా.. దక్షణి కొరియాలు పాల్గొంటున్న జీ7 సదస్సు తాజాగా యూకేలో సాగుతోంది. జీ7 సదస్సు నేపథ్యంలో దీనికి హాజరైన దేశాధినేతలంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. సాధారణంగా ఇలాంటి సదస్సులకు ఒకరి పక్కన మరొకరు నిలుచొని.. చేతులు పైకెత్తి మరీ ప్రపంచానికి తమ సంఘీభావాన్నితెలుపుతూ గ్రూప్ ఫోటో దిగటం ఇప్పుడు చూశాం.

ప్రస్తుతం నడుస్తున్నది ఖతర్నాక్ కరోనా కాలం. ఇలాంటివేళ నిర్వహిస్తున్న జీ7 సదస్సుకు హాజరైన దేశాధినేతలంతా కలిసి గ్రూప్ ఫోటోకు ఫోజు ఇచ్చారు. కాకుంటే రోటీన్ కు కాస్త భిన్నంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ.. దూర దూరాన నిలబడి ఫోటోకు ఫోజిచ్చారు. కరోనా విరుచుకుపడిన దశలో ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొందన్న విషయాన్ని భవిష్యత్ తరాలకు ఈ ఫోటో ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పకతప్పదు.

ప్రపంచాన్ని కరోనాకు ముందు.. కరోనా తర్వాత అన్న తేడా చెప్పేందుకు.. తాజా ఫోటోకు మించింది మరొకటి ఉండదన్న మాట వినిపిస్తోంది. తాజాగా జరిగిన సదస్సుకు హాజరైన దేశాధినేతలంతా తమ మొదటి రోజు కరోనా వ్యాప్తి.. నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్ పైనే చర్చించారు. కనీసం 100 కోట్ల కరోనా టోకాల్ని ప్రపంచ దేశాలకు అందజేయాలని నిర్ణయించారు. మహమ్మారి కారణంగా నష్టపోయిన దేశాలకు చేయూతను అందించాలని సంపన్న దేశాధినేతలు డిసైడ్ అయ్యారు.
Tags:    

Similar News