నోట్లు ముద్రించేయండి మోదీ గారు..ఇదే ఇప్పుడు కావాల్సింది!

Update: 2020-05-02 15:30 GMT
క‌రోనా క‌ల‌క‌లం భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ఓ రేంజ్‌లో ప్ర‌భావితం చేసింద‌నేది కాద‌నలేనిది. క‌రోనా కాటుతో ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాల‌నే చ‌ర్చ‌లు, విశ్లేష‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఈ త‌రుణంలో నూత‌న ప్రతిపాద‌న తెర‌మీద‌కు వ‌చ్చింది. అమెరికా, జపాన్‌, యూరప్‌లోని మరికొన్ని ధనిక దేశాలతోపాటు టర్కీ - ఇండోనేషియా లాంటి వర్థమాన దేశాలు సైతం తమ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు అనుస‌రించిన విధానాన్నే మ‌న దేశం ఫాలో అవాల‌ని సూచించారు. అదే న‌గ‌దు ముద్రణ‌. ఔను. ఆ దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు ఇప్పటికే నగదును ముద్రిస్తూ పలు చర్యలు చేపడుతున్నాయి. ఇదేవిధమైన చర్యలు మన దేశంలోనూ చేపట్టాలని సూచిస్తున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థతోపాటు రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలను లాక్‌ డౌన్‌ తీవ్రంగా దెబ్బతీస్తున్నది. ఈ నేపథ్యంలో నగదు చెలామణిని పెంపొందించి ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ విధానాన్ని అనుసరించడమే ఉత్తమమన్న అభిప్రాయం రోజురోజుకూ బలపడుతున్నది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నాయని, ప్రజలకు వైద్యసేవలు, నిత్యావసర వస్తు సరఫరాలు అందజేయడంతో పాటు వారి జీవనోపాధిని కాపాడటంలో రాష్ర్టాలకు కేంద్రం చేయూతనివ్వాలని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ దువ్వూరి సుబ్బారావు ఉద్ఘాటించారు.

దేశ ఆర్థిక వ్యవస్థను నానాటికీ పెరుగుతున్న సమస్యల నుంచి గట్టెక్కించేందుకు నగదు ముద్రణతోపాటు క్వాంటిటేటివ్‌ పద్ధతులపై కేంద్ర ప్రభుత్వం - రిజర్వు బ్యాంకు వెంటనే దృష్టిసారించాలన్న అభిప్రాయం అనేక వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. కరోనా కాటుతో ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్‌ బ్యాంకులు తమతమ దేశాల్లోని ఆర్థిక సంస్థలకు గణనీయంగా రుణాలిస్తున్నాయి. ఇలాంటి బలమైన ఆర్థిక ఉద్దీపనలు భారత ఆర్థిక వ్యవస్థకూ ఎంతో అవసరం. ఇంతటి భారీ రుణాలను మార్కె ట్‌ అందజేయలేదు. నగదును ముద్రించడం ద్వారా భారీగా నిధులు సమకూర్చడం రిజర్వు బ్యాంకుకే సాధ్యమవుతుంద‌ని చెప్తున్నారు.
Tags:    

Similar News