తెలుగు రాష్ట్రాల్లో కరోనా కలకలం ... షాద్ నగర్ - భీమిలిలో హై అలెర్ట్ !

Update: 2020-04-01 09:10 GMT
కరోనా వైరస్ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో క్రమక్రమంగా పెరుగుతుంది. కరోనా వైరస్ కు  మందు లేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. దీనితో భారత్ లో కూడా కేంద్రం లాక్ డౌన్ విధించింది. అయినా కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి అని టెంక్షన్ పడుతుంటే ..తాజాగా ఢిల్లీ లోని మర్కజ్ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ గా వస్తుండటం తో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మరింత కఠినంగా లాక్ డౌన్ ని అమలు చేయాలనీ భావిస్తున్నారు.

ఇకపోతే, ఏపీలోని భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం వెంకటాపురంలో కరోనా కల్లోలం సృష్టించింది. దీంతో గ్రామస్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వారు కూడా పది రోజుల నుంచి భయాందోళనల మధ్య గడుపుతున్నారు.   లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి కరోనా వైరస్‌ సోకినట్టు గతనెల 22న విశాఖ చెస్టు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. దీంతో అదే రోజు యువకుడి కుటుంబంలో నలుగురితో పాటు 23 మందిని విశాఖ ఆస్పత్రికి తరలించారు. కాగా వీరిలో యువకుడి తండ్రికి 26న పాజిటివ్‌ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇతను ఎవరిని కలిశారో తెలుసుకుని మరో 10 మందిని తరలించారు. రెండు విడతల్లో మొత్తం 33 మందిని ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడి సోదరి, తల్లికి కరోనా పాజిటివ్‌ గా వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో నాలుగు కేసులు నమోదు కావడంతో  గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మిగిలిన వారిని క్వారంటైన్ చేసారు.

ఇకపోతే  ఢిల్లీలోని  నిజామొద్దీన్‌ ప్రాంతంలోని మర్కజ్‌ లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న షాద్‌ నగర్‌ పట్టణానికి చెందిన ముగ్గురు అనుమానిత ముస్లింలను మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారు మర్కజ్‌ వెళ్లినందున మరి కొందరికి వైరస్‌ సోకే ప్రమాదముంది. దీంతో జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ వైద్య సిబ్బంది, పోలీసులను అప్రమత్తం చేశారు. వారిని గుర్తించి వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.  దీనితో వెంటనే  పోలీసు భద్రత మధ్య ఆ ముగ్గురిని అంబులెన్స్‌ లో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అలాగే  ఆ మూడు కుటుంబ సభ్యులని కూడా ఓ డీసీఎం లో రాజేంద్రనగర్‌ లోని జిల్లా క్వారంటైన్‌ సెంటర్‌ కు పరీక్షల నిమిత్తం తరలించారు. అయితే కరోనా కట్టడిలోకి వస్తుంది అని అనుకుంటున్న సమయంలో మర్కజ్ ఘటన తో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కి పడుతుంది. దీనితో ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి సహకరించి ...కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు.
Tags:    

Similar News