200 కేసులు.. తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా క‌ల్లోలం

Update: 2020-04-01 17:30 GMT
తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తోంది. క‌రోనా వైర‌స్ బారిన తెలుగు ప్రజ‌లు పెద్ద ఎత్తున ప‌డుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో క‌లిపి క‌రోనా కేసులు 200కు చేరువ‌య్యాయి. ఢిల్లీలో జ‌రిగిన ఓ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మానికి వెళ్లి వ‌చ్చిన వారి వ‌ల‌న తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా తీవ్ర రూపం దాల్చ‌డానికి కార‌ణమైంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో 97, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 87కు చేరాయి. ఏపీలో క‌రోనా మృతులు లేక‌పోగా తెలంగాణ‌లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు 6మంది మృతి చెందారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి వచ్చిన ప్రయాణికుల్లో చాలామందికి కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిన వారిలో ఎక్కువ మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం దీంతో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా మారింది.  దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కేసీఆర్, జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అప్ర‌మ‌త్త‌మై ఉన్న‌త స్థాయి స‌మీక్ష నిర్వ‌హించారు.

ఢిల్లీలోని మర్కజ్‌ ప్రార్థనలకు దేశ వ్యాప్తంగా ఓ మతానికి చెందిన ప్రజలు హాజరయ్యారు. మార్చి 14 - 15వ తేదీల్లో జరిగిన ప్రార్థనలకు రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున ఆ మతానికి చెందిన ప్రజలు వెళ్లారు. ఆ దర్గాకు వెళ్లిన వారి తిరిగి రాష్ట్రంలోని తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే అక్కడే వారికి కరోనా సోకింది. ఆ విషయం సోకిన వారితో వారి కుటుంబసభ్యులు, సన్నిహితులకు తెలియ లేదు. దీంతో యథావిధిగా తమ పనులు చేసుకున్నారు. ఇప్పుడు అక్కడకు వెళ్లిన ప్రయాణికుల్లో కరోనా వైరస్‌ బయటపడుతోంది. మార్చి 17వ తేదీన రాష్ట్రానికి వచ్చిన వారు 14 రోజులు ముగియడంతో మార్చి 31వ తేదీన కరోనా వైరస్‌ బయటపడింది. ఆ కరోనా వైరస్‌ పాజిటివ్‌ తేలడంతో వారి కుటుంబసభ్యులతో పాటు వారి బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. దీంతో ప్రజలతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఇంకా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిని ప్రభుత్వం అన్వేషిస్తోంది. వారిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈమేరకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ ప్రార్థనలకు వెళ్లిన వారు ఎవరు? ఎక్కడ ఉన్నారో జల్లెడ పడుతున్నారు. దీంతోపాటు ఢిల్లీ నుంచి వచ్చే క్రమంలో వారు ప్రయాణించిన రైలు - బస్సు - ఆటో తదితర వివరాలు ఆరా తీస్తున్నారు. వారితో పాటు ప్రయాణించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఢిల్లీ ప్రయాణికులతో ఒక్కసారిగా రాష్ట్రంలో అలజడి మొదలైంది. మార్చి 14 - 15 నుంచి 17వ తేదీ మధ్య ఢిల్లీ వెళ్లొచ్చిన వారిని గుర్తిస్తున్నారు. దురంతో, ఏపీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లల్లో ప్రయాణించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అయితే వారు ఢిల్లీ నుంచి వచ్చిన వారు రాష్ట్రంలో ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారోనని పోలీసులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు 97కు చేరాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా తో ఆరుగురు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి  14 మంది బాధితులు కోలుకున్నారు. కాగా 77 మందికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ సోకిన వారి సంఖ్య 87. మొత్తం 373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. మిగిలిన 330 కేసుల్లో నెగిటివ్‌ వచ్చింది.

అయితే క‌రోనా క‌ట్ట‌డికి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున త‌ర‌లివెళ్ల‌డం.. ఏపీ, తెలంగాణ మ‌ధ్య ప్ర‌జ‌లు రాక‌పోక‌లు సాగించ‌డంతో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుని వివ‌రాలు ఇచ్చిపుచ్చుకోనున్నారు. మొత్తానికి క‌రోనా అనుమానితుల‌ను గుర్తించి వారికి స‌త్వ‌ర‌మే వైద్యం అందించి క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, కేసీఆర్‌తో క‌లిసి ప‌ని చేయ‌నున్నారు.
Tags:    

Similar News