అపార్ట్ మెంట్లోకి వైద్యుడికి నో ఎంట్రీ.. హైదరాబాద్ లో కలకలం

Update: 2020-04-25 04:00 GMT
ప్రాణాల్ని కాపాడేందుకు తన ప్రాణాల్ని పణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బంది విషయంలో కొందరు వ్యవహరిస్తున్న తీరు తరచూ విమర్శలకు గురవుతోంది. తాజాగా అలాంటి పరిస్థితే హైదరాబాద్ లోని వనస్థలిపురంలో చోటు చేసుకుంది. కరోనా లాంటి భయంకరమైన వైరస్ నుంచి కాపాడేందుకు వైద్యులు పెద్ద ఎత్తున రిస్కు తీసుకుంటున్నారు. ప్రజల కోసం తమ ప్రాణాల్ని లెక్క చేయకుండా వారు వైద్యం చేస్తూ ఎన్నో ప్రాణాల్ని కాపాడుతున్నారు.

ఇలాంటివారి విషయంలో ప్రత్యేకంగా ఏమీ చేయకున్నా.. వారిని అవస్థలకు గురి చేయకుండా ఉండటం చాలా అవసరం. అందుకు భిన్నంగా అతడి కారణంగా తమకు వైరస్ అంటుతుందన్న అనవసరమైన భయాందోళనలతో వారిని మానసికంగా వేదనకు గురయ్యేలా చేస్తున్న వైనం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. కరోనా వైద్యం చేస్తున్న వైద్యుల్ని అపార్ట్ మెంట్లోకి రానివ్వకూడదన్న నిర్ణయాలు తీసుకోవటం.. కొన్నిచోట్ల వారిపై దాడులు చేయటం తెలిసిందే.

వనస్థలిపురం లోని ఒక అపార్ట్ మెంట్ వాసులు తమ వద్ద ఉండే వైద్యుడ్ని అపార్ట్ మెంట్లోకి అనుమతించేందుకు నిరాకరించారు. మీ వల్ల మా అందరికి ముప్పు. మాకు కరోనా వచ్చే ప్రమాదం ఉంది. మీరు అపార్ట్ మెంట్లోకి రావొద్దనటమే కాదు.. తీర్మానాన్ని చేశారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సదరు వైద్యుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై వారు ఐపీసీ సెక్షన్లు 188, 341, 506, 509 కింద అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న కొందరిపై కేసు నమోదు చేశారు. వైద్యుల విషయంలో ఇలాంటివి సహించమని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. అత్యవసర సేవల్లో పాల్గొనే వారి విషయంలో వివక్ష ప్రదర్శించటం నేరమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

కరోనా భయంతో తమ వద్ద నివాసం ఉండే వైద్యుడ్ని వద్దన్న అపార్ట్ మెంట్ వాసులు.. పొరపాటున తమలో ఎవరికైనా ఒకరికి కరోనా బారిన పడితే.. ఆ రోజున వారికి వైద్యం చేయమని వైద్యులు అంటే ఎలా ఉంటుంది? ఒక్క క్షణం ఇలా ఆలోచిస్తే.. వైద్యులు.. వైద్య సిబ్బంది విషయంలో ఎలా వ్యవహరించాలో ఇట్లే అర్థమవుతుందని చెప్పాలి.
Tags:    

Similar News