సోకిన నుంచి డిశ్చార్జి వ‌ర‌కు అయ్యే ఖ‌ర్చు రూ.మూడున్న‌ర ల‌క్ష‌లు

Update: 2020-05-04 02:45 GMT
క‌‌రోనా వైర‌స్‌ ను గుర్తించి వారికి పాజిటివ్ గన‌క వస్తే వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో ఇంటి నుంచి ఆస్ప‌త్రికి చేరుకుని మ‌ళ్లీ అతడు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరేంత వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే ఖ‌ర్చు భ‌రిస్తోంది. బాధితులు ఆస్ప‌త్రిలో చేరిన మొద‌లుకుని కోలుకుని ఇంటికి చేరే వ‌ర‌కు భారీగా ఖ‌ర్చవుతోంది. ఆస్ప‌త్రిలో చేరిన వారికి వ‌స‌తి, భోజ‌నం, మందులు, చికిత్స‌కు మొత్తం అయ్యే ఖర్చు గురించి తొలిసారిగా బ‌య‌ట‌కు తెలిసింది. క‌‌రోనా బాధితులు కోలుకునేందుకు ప్ర‌భుత‌్వాలు భారీగా ఖ‌ర్చు చేస్తున్నాయి.

వైరస్‌ నిర్ధారణ పరీక్ష మొదలు చికిత్స పొంది ఆరోగ్యంగా ఇంటికి చేరే వరకు ఒక్కో వ్యక్తిపై రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతున్నట్టు  తెలిసింది. క‌రోనా లెక్క‌లు ఓ అంచ‌నా వేశారు. ఏ ఏ ప‌రీక్ష‌కు ఎంతెంత ఖ‌ర్చు అవుతుందో దాదాపుగా చెబుతున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.4,500 అవుతుంద‌ని తేల్చారు. తొలి ప‌రీక్ష‌లో క‌రోనా పాజిటివ్ అని తేలితే వారికి చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తారు. పాజిటివ్ కేసులకు చికిత్స అనంతరం మరో రెండుసార్లు నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఇలా ఒక్కొక్కరికీ మూడు సార్లు ప‌రీక్ష‌లు చేస్తారు. ఆ ప‌రీక్ష‌ల‌కు రూ.13,500 చొప్పున నిర్ధార‌ణ ప‌రీక్ష‌లకు ఖ‌ర్చు అవుతోంది. అనుమానితులను అంబులెన్స్‌లోనే ఆస్ప‌త్రికి తీసుకొచ్చి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. అనంత‌రం డిశ్చార్జి చేసిన వ్య‌క్తిని  ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి పంపుతారు. రోగి రవాణా ఖర్చు రూ.4 వేలకు పైగా అవుతోంద‌ని అంచ‌నా. పాజిటివ్ సోకిన వ‌ర‌కు చికిత్స పూర్త‌య్యేవ‌ర‌కు దాదాపు కనీసం 80 వరకు పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) కిట్లు వినియోగిస్తారు. అయితే ఆ కిట్లను ఒక్కసారికి మాత్ర‌మే వాడ‌వ‌చ్చు. వాటిని తిరిగి వాడ‌లేం. ఆ ఒక్క కిట్‌ ధర రూ.2,500కు పైగా. దీంతో ఈ కిట్ల కోసం రూ.2 లక్షలు ఖర్చు అవుతోంది.

వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న‌వారికి అధికంగా ఖ‌ర్చ‌య్యే అవ‌కాశం ఉంది. వారికి అధిక సంఖ్య‌లో పీపీఈ కిట్లు మార్చాలి. దీంతో అద‌నంగా మ‌రికొంత ఖ‌ర్చ‌వుతోంది. ఇక క‌రోనా నుంచి కోలుకునేంద‌కు మందులు ఇస్తారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచేందుకు, వారికి యాంటీ బయాటిక్‌, యాంటీ వైరల్‌ మందులు, ఫ్లూయిడ్స్ తదితర మందులు అందించేందుకు రూ.50 వేలకు పైగా ఖ‌ర్చవుతోంది.

ఇక ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన‌న్ని రోజులు భోజ‌నం అందిస్తారు. బాగా తింటే రోగ నిరోధక శక్తిని పెరుగుతంద‌ని భావించి వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. రోజు ఉదయం అల్పాహారం, రెండుసార్లు భోజనం, డ్రైఫ్రూట్స్‌, పాలు, బ్రెడ్‌, నాలుగు నీళ్ల సీసాలు ఇస్తున్నారు. దీనిక‌య్యే ఖ‌ర్చు రూ.55 వేలు. వీటితోపాటు రోగులు వాడేందుకు స‌బ్బులు, శానిటైజ‌ర్‌,  ప్రత్యేక డ్రెస్‌ వంటివి ఇస్తుండ‌గా వాటికి రూ.27 వేలు కూడా ఖర్చవుతోంది. వీట‌న్నిటి లెక్క వేస్తే మొత్తం ఒక్క రోగికి దాదాపు రూ.మూడున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతోంద‌ని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచ‌నా వేశారు. అయితే ప్ర‌భుత్వాలు రోగి కోలుకోనేందుకు ఎంత ఖ‌ర్చ‌యినా చేసేందుకు సిద్ధ‌ప‌డ‌డంతో ఆస్ప‌త్రి నిర్వాహ‌కులు రోగుల క్షేమం కోసం అద్భుత సౌక‌ర్యాలు అందిస్తున్నారు.

Tags:    

Similar News