కరోనా ఇండియా:42 వేలు దాటిన కేసులు

Update: 2020-05-04 06:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. గడచిన 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా దాదాపు 2,700మందికి కొత్తగా వైరస్ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,533 దాటింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 83 మంది కరోనాకు బలయ్యారు. ఒక్కరోజులో ఇంత గరిష్ఠ స్థాయిలో కేసులు, మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. పాజిటివ్ కేసుల్లో ముందున్న రికార్డులను ఆదివారం బ్రేక్ చేసింది. అయితే, మహమ్మారి బారినపడి 11,775 మంది కోలుకోవడం సానుకూలం. మొత్తం దేశంలో కరోనా మరణాలు 1,391కి చేరాయి.

మహారాష్ట్ర, ఢిల్లీ,తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, యూపీలలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది.

*ఏపీలో 1583  కరోనా పాజిటివ్ కేసులు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1583కి చేరింది. ఇప్పటివరకు కరోనా కారణంగా 33మంది మరణించారు. ఇక వైరస్ బారి నుంచి 488మంది కోలుకున్నారు. ఇంకా యాక్టివ్ కేసులు 1062 ఉన్నాయి.

*తెలంగాణలో 1082కి కేసులు
తెలంగాణలో కరోనా మ‌హ‌మ్మారి రోజుకో రీతిలో మారుతోంది. ఒక రోజు తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా.. ఇంకోరోజు అధికంగా కేసులు నమోదవుతున్నారు. వారం కిందటి వరకు సింగిల్ డిజిట్‌కు చేరిన కేసులు ఇప్పుడు రెండంకెలకు చేరింది. తాజాగా ఆదివారం కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసుల్లో 20  జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కాగా జగిత్యాలలో ఒక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌వ్యాప్తంగా మొత్తం 533 మంది వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతు‌న్నారు. ఆదివారం న‌మోదైన‌ 21 కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,082కు చేరింది. 14 రోజుల అనంత‌రం సిరిసిల్లా, జగిత్యాల జిల్లాలో ఒక కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది.

*ప్రపంచవ్యాప్తంగా..
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీని బారినపడి దాదాపు రెండున్నర లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.  ఇప్పటి వరకూ విలయతాండవం చేసిన అమెరికా సహా ఐరోపాలోని స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లో మహమ్మారి కొంత శాంతించింది. మరణాలు, కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించారు. ఇన్నాళ్లూ నిర్బంధంలో ఉన్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 35.66 లక్షల మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో 248,286 మంది చనిపోయారు. అలాగే, వైరస్ నిర్ధారణ అయినవారిలో 1,154,057 మంది కోలుకున్నారు. మరో 21 లక్షల మంది పరిస్థితి నిలకడగా, 5000 మంది పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉంది.

ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా బాధితులు, మరణాలు అమెరికాలోనే చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ దాదాపు 12 లక్షల మంది వైరస్ బారినపడిగా.. 68,598 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా చేతిలో కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ ఉంటుందని అధ్యక్షుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరగలేదు.

ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్‌లో కొత్త కేసులు, మరణాలు తగ్గుముఖం పట్టాయి. ఇన్నాళ్లూ రోజుకు సగటున 700 వరకు మరణాలు నమోదు కాగా.. గత వారం రోజులుగా 200లోపు నమోదు కావడం ఊరటనిచ్చే అంశం. స్పెయిన్‌ లో మార్చి 14 నుంచి అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఆంక్షలు పాక్షికంగా సడలించారు. ఇటలీలోనూ నేటి నుంచి పార్క్‌లు తెరుచుకోనున్నాయి.
Tags:    

Similar News