తెలంగాణలోనూ ‘ఏపీ రాజకీయం’ మొదలైందా?

Update: 2020-05-02 05:00 GMT
కరోనా వేళ రాజకీయ విమర్శలు పెద్దగా వినిపించని పరిస్థితి. ఆ లోటును తీర్చటంలో ఏపీ అధికార.. విపక్ష నేతలు పోటీ పడుతున్నారని చెప్పక తప్పదు. సంక్షోభ సమయంలో ప్రజల శ్రేయస్సును వదిలేసి.. పొలిటికల్ మైలేజీ కోసం కిందామీదా పడుతున్నారు. ఇలాంటివేళ.. నిర్మాణాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా చేస్తే.. తాముకోరుకునే పొలిటికల్ మైలేజీ మిస్ అవుతామన్న భావన ఏపీ నేతల్లో అంతకంతకూ పెరుగుతోంది. దీంతో.. కరోనా వేళ.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కంటే కూడా.. ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపేందుకే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. ఏపీతో పోలిస్తే.. తెలంగాణ లో రాజకీయం కాస్త భిన్నంగా ఉందని చెప్పాలి.

కరోనా వేళ.. తెలంగాణ అధికారపక్షాన్ని విమర్శించే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి ప్రతిపక్షాలు దీనికి కారణం గులాబీ బ్యాచే. ప్రతిపక్షాల్ని ప్రజలు మర్చిపోయారంటూ ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు విపక్షాలకు చురుకుపుట్టేలా చేశాయని చెప్పాలి. ఇటీవల రంగంలోకి దిగిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గులాబీ నేతలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. తమ ప్రభుత్వం బాగా పని చేస్తుందని కరోనా కేంద్ర బృందం కితాబు ఇస్తున్న వేళ.. అందుకు భిన్నంగా బీజేపీ నేతలు మాత్రం ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న తీరును మంత్రి ఈటెల తీవ్రంగా తప్పు పడుతున్నారు.

ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ లో తబ్లిగీల సమావేశానికి ఎందుకు అనుమతి ఇచ్చారన్న సూటిప్రశ్నను సంధించారు. బాధ్యత లేకుంగా వ్యవహరించిన బీజేపీ సర్కారు కారణంతోనే దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువైందన్న బండను మోడీ సర్కారు పై వేసేశారు మంత్రి ఈటెల. తెలంగాణ నుంచి మర్కజ్ వెళ్లిన వారందరిని గుర్తించటమే కాదు.. పరీక్షలు జరిపామని.. అలా చేయకుంటే దేశంలో అత్యధిక కేసులు హైదరాబాద్ లోనే ఉండేవన్నారు. కరోనా వేళ.. అనవసరమైన రాజకీయ ఆరోపణలకు దూరంగా తెలంగాణ రాష్ట్రం ఉందన్న వ్యాఖ్యలకు భిన్నమైన పరిస్థితులు తాజాగా చోటు చేసుకోవటం గమనార్హం. ఈటెల వారి నోటి నుంచి ఇంత మాట వచ్చాక కమలనాథులు కామ్ గా ఉంటారా?
Tags:    

Similar News