కరోనా ఎఫెక్ట్..మాంద్యంతో పాటు ఆహార సంక్షోభం కూడా!

Update: 2020-04-10 02:30 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ప్రాణాంతక వైరస్ కారణంగా లెక్కలేనన్ని సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది అన్ని దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్తితులు తప్పవన్న వాదనలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో కరోనా కారణంగా త్వరలోనే ఆహార సంక్షోభం కూడా తప్పదన్న వాదనలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇందుకు కారణాలుగా నిలుస్తున్న అంశాలతో ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అధిపతి క్యూ డొంగ్యూ ఓ సంచలన ప్రకటన చేశారు.

క్యూ డొంగ్యూ చెబుతున్న వాదన వింటే.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం తలెత్తడం గ్యారెంటీనేనని చెప్పక తప్పదు. అదెలాగో చూద్దాం పదండి. కరోనా వైరస్ ను కట్టడి చేయడమే పరమావధి అన్నట్లుగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. దీంతో ఎగుమతులతో పాటు దిగుమతులు, దేశీయ రవాణా పూర్తిగా నిలిచిపోయింది. వెరసి ఎక్కడి ఉత్పత్తులు అక్కడే ఆగిపోయాయి. అంటే ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయిన వస్తువులు, వ్యవసాయోత్పత్తులు... ఇతర ప్రాంతాలకు రవాణా కావడం దాదాపుగా స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో ఎక్కడ పండిన వ్యవసాయ ఉత్పత్తులు అక్కడే స్తంభించిపోయాయి. అదే సమయంలో లాక్ డౌన్, ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ధరలు అమాంతంగా పెరిగే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో వర్తకులు ఉత్పత్తులను బ్లాక్ చేయడం ప్రారంభించేశారు. ఈ తరహాలో వ్యవసాయోత్పత్తుల బ్లాకింగ్ మరింత కాలం కూడా కొనసాగే ప్రమాదం లేకపోలేదు.

మరోవైపు... లాక్ డౌన్ మరింత కాలం పాటు కొనసాగించే అవకాశాలున్న నేపథ్యంలో జనం కూడా ఆహార పదార్థాలను భారీగా కొనుగోలు చేయడం ప్రారంభించారు. ధరలు పెరుగుతాయన్న వాదనలతోనూ ఈ తరహా కొనుగోళ్లు పెరిగాయి. కొనుగోళ్లు పెరిగినంత మేర ధరలు కూడా పెరిగిపోతున్నాయి. వెరసి త్వరలోనే ఆహార పదార్థాలకు తీవ్ర కొరత ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే ఒక్క మన దేశంలోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఆహార సంక్షోభం ముంచుకురానుందని చెప్పక తప్పదు. ఇదే జరిగితే... మధ్య తరగతి - పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం లేకపోలేదు. ఈ పరిణామాలు ఇప్పుడిప్పుడే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే.. ఆహార సంక్షోభం తారాస్థాయికి చేరే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి.
Tags:    

Similar News