ఏపీలో ఇంత‌మందిలో క‌రోనా ఉంద‌ని డౌటుందా?

Update: 2020-03-05 03:30 GMT
క‌రోనా వైర‌స్ పొరుగున ఉన్న చైనా నుంచి ఇప్పుడు మ‌న పట్ట‌ణాల్లోకి, అక్క‌డి నుంచి ప‌ల్లెలోకి వ‌చ్చి చేరుతుంద‌ని భ‌యంతో బ‌త‌కాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. తెలంగాణలో కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో ప‌క్క‌నే ఉన్న ఏపీలోనూ ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి తోడు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం వాసికి కరోనా సోకినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తుండ‌టంతో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, దీనికి తోడుగా పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కొండెపాడుకు చెందిన సత్తిరాజు అనే యువకుడు - అతనికి మామ వరుసయ్యే గురుమూర్తిలో సైతం ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని అంటున్నారు.

స‌త్తిరాజు గత నెల 18నే మస్కట్(ఒమన్) నుంచి తిరిగొచ్చాడు. సత్తిరాజుతో క‌లిసి గురుమూర్తిలు గత 20 రోజుల్లో చాలా ప్రదేశాలు తిరిగారు. అయితే, మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు - జలుబు - జ్వరంతో బాధపడుతున్నారు. తొలుత వాళ్లను ముదునూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా.. డాక్టర్ల విచారణలో క‌రోనా అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. దీంతో, క‌రోనా నిర్ధారణ కోసం ఆ ఇద్దరి శాంపిల్స్ ను తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్ కు పంపామని, పుణె ల్యాబ్ కు కూడా పంపే ఏర్పాట్లు చేస్తున్నామని ఏలూరు డాక్టర్లు చెప్పారు.

కాగా, స‌త్తిరాజు అతని మామ గురుమూర్తి హైద‌రాబాద్‌లో స్నేహితుల దగ్గర ఓ రెండ్రోజులు - పశ్చిమగోదావరి జిల్లాలోని స్వగ్రామంలో - రాజోలుకు వెళ్లి బంధువుల ఇంట్లో ఐదు రోజులు ఉండి తిరిగి సొంతూరుకు చేరుకోవ‌డంతో వైరస్ మరింతమందికి వ్యాపించి ఉంటుందేమోనని డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఈ మేర‌కు అనుమానితుల‌కు సైతం పరీక్ష‌లు చేయాల‌ని వైద్యులు భావిస్తున్నారు.


Tags:    

Similar News