దిగి వచ్చిన తెలంగాణ కార్పొరేట్ ఆసుపత్రులు

Update: 2020-08-14 04:03 GMT
ప్రజలు కష్టంలో ఉన్నవేళలో కార్పొరేట్ ఆసుపత్రులు సేవాభావంతో వైద్యం చేసే కన్నా.. కాసుల కక్కుర్తితో ఎంత దారుణంగా వ్యవహరిస్తాయన్న విషయం కరోనా ఎపిసోడ్ తో అందరికి అర్థమయ్యేలా చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ ఆసుపత్రుల లీలలు తరచూ వివాదాలుగా మారి.. వార్తాంశాలుగా మారాయి. రోజుకు లక్ష రూపాయిలకు పైనే కరోనా వైద్యానికి బిల్లులు వేస్తూ.. లక్షలాది రూపాయిల్ని దోచేసిన వైనం పలు సందర్భాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి తోడు.. బెడ్లు లేవని తేల్చి చెప్పటం ద్వారా.. పెద్ద ఎత్తున ప్రాణాలు పోయిన వైనాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి.

కరోనా వైద్యానికి ఎంత వసూలు చేయాలన్న అంశంపై తెలంగాణ ప్రభుత్వం ధరల్ని ఫిక్స్ చేయగా.. వాటిని పట్టించుకోకుండా వ్యవహరించిన వైనంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆరాచకానికి పరాకాష్ఠంగా చోటు చేసుకున్న ఉదంతాలపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. కరోనా సేవలు సదరు ఆసుపత్రులు చేయకుండా చర్యలు తీసుకోవటం తెలిసిందే.

కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీపై నెగిటివ్ వార్తలు పెద్దఎత్తున రావటమే కాదు.. తెలంగాణ హైకోర్టు సైతం ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రభుత్వాల కంటే కార్పొరేట్ ఆసుపత్రులు శక్తివంతమైనవా? అంటూ వ్యాఖ్యలు చేసింది. కార్పొరేట్ ఆసుపత్రుల తీరు కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుండటం తెలిసిందే. దీంతో వారిపైయ చర్యలు తీసుకోవటంలో ఏ మాత్రం ఆలస్యం చోటు చేసుకున్నా.. మరింత డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని వారికి పరోక్షంగా తెలియజేశారు.

మారుతున్న పరిస్థితిని గుర్తించిన సదరు కార్పొరేట్ ఆసుపత్రులు తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకున్నాయి. ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత.. ప్రభుత్వం నుంచి ఎక్కువ అవుతున్న ఒత్తిడి నేపథ్యంలో.. తమ ఆసుపత్రుల్లో ఉండే కరోనా బెడ్లలో యాభై శాతం ప్రభుత్వం వినియోగించుకునేలా ఇచ్చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశాయి. తాజాగా మంత్రి ఈటెల రాజేందర్ తో భేటీ అయిన సందర్భంగా వారు ఆ నిర్ణయానికి వచ్చినట్లుగా చెబుతున్నారు.కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు మంత్రి ఈటెల వివరించటంతో.. వెంటనే స్పందించిన వారు యాభై శాతం బెడ్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఓకే చెప్పేసినట్లు చెబుతున్నారు. ఇంతకాలం స్పందించనివారు.. ఇప్పుడే స్పందించటం వెనుకున్న మర్మమేమిటి? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది.


    

Tags:    

Similar News