1983 ఎన్నికల వేళలో జీవన్ రెడ్డి గెలిచేందుకు చేసిన ఖర్చు ఎంతో తెలిస్తే షాకే

Update: 2021-10-31 15:30 GMT
అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. గెలుపు ఎవరిదన్న దానిపై కూడా ఎవరికి పెద్ద సందేహాలు లేవు. మంత్రి హరీశ్ రావు మినహాయిస్తే టీఆర్ఎస్ కు చెందిన ఈ ప్రముఖ నేత కూడా ఉప పోరులో గెలిచేది ఎవరన్న దానిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అందరి నోట బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్న మాటే వినిపిస్తోంది. దీనికి తోడు.. ఉప పోరు ముగిసిన తర్వాత వెలువడిన అంచనాలు.. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మంచి మెజార్టీతో ఈటల రాజేందర్ గెలుస్తారన్న మాట వినిపిస్తోంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. హుజూరాబాద్ ఉప పోరు వేళ హాట్ టాపిక్ గా మారిన అంశం ఏమైనా ఉందంటే.. అది ఎన్నికల్లో అయ్యే ఖర్చే. గతంలో మరే ఉప ఎన్నికకు లేనంత భారీగా పెట్టిన ఖర్చు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కలలో కూడా ఊహించలేని స్థాయికి ఎన్నికల ఖర్చును పెంచేసిన క్రెడిట్ టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది. ఈ ఉప ఎన్నిక కోసం ఏకంగా ఒక ప్రభుత్వ పథకాన్నే తీసుకొచ్చిన కేసీఆర్.. ఉప ఎన్నికకు ముందు నుంచే తాయిలాలు ఇవ్వటం షురూ చేశారు.

పోలింగ్ కు కాస్త ముందు ఓటుకు రూ.6వేలు చొప్పున టీఆర్ఎస్ నేతలు పంచిన వైనం అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. ఈటల సైతం అందులో సగం కాదు కదా.. పావు మొత్తాన్ని మాత్రమే ఇవ్వగలిగారంటున్నారు. ఆయన ఓటుకు రూ.1500 చొప్పున పంచినట్లుగా తెలుస్తోంది. గతంలో ఓటర్లకు పంచే మొత్తం మాత్రమే కాదు.. దానికి సంబంధించిన వారు కూడా ఒక మోతాదులోనే ఉండేవారు. అందుకు భిన్నంగా తాజా పోరు సందర్భంగా అధికార టీఆర్ఎస్ సరికొత్త సంప్రదాయానికి తెర తీసినట్లుగా చెబుతున్నారు. ఓట్ల కొనుగోలులో కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

తాము టార్గెట్ చేసిన వారిలో 65 శాతానికి కచ్ఛితంగా డబ్బులు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. మొత్తంగా ఉప పోరు ఏకంగా రూ.500 కోట్లను టచ్ చేయటం చూసిన వారికి తెలంగాణలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక ఉప ఎన్నికలో విజయం సాధించటం కోసం ఇంత భారీగా ఖర్చు చేయటం ఒక ఎత్తు అయితే.. ఇంత ఖర్చు చేయాలంటే అసలు ఎంత ఉండాలి? అన్నది మరో ప్రశ్నగా మారింది. ఇలాంటి వేళ.. 1983లో జరిగిన ఎన్నికల గురించి ప్రస్తావన చేస్తున్నారు.

1983లో తెలంగాణ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నా.. అప్పట్లో మాత్రం టీడీపీలో ఉండేవారు. జగిత్యాల నుంచి పోటీ చేసిన ఆయన అప్పట్లో రూ.15వేలు మాత్రమే ఖర్చు చేవారు. తన వద్ద కేవలం రూ.10వేలు మాత్రమే ఉండటం.. ఎన్నికల్లో గెలుపునకు మరో రూ.5వేలు ఉంటే ఖాయంగా గెలుస్తామని భావించి ఆయన.. ఎన్టీఆర్ వద్దకు వెళ్లి రూ.5వేలు ఇవ్వాలని కోరారు. దీంతో.. ఆ మొత్తాన్ని అప్పట్లో ఎన్టీఆర్ సర్దుబాటు చేశారు. ఆ ఎన్నికల్లో జీవన్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచారు.

అదే తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్.. తాజాగా జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎంత భారీగా ఖర్చును పెంచేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన.. గెలుపు కోసం వెనుకా ముందు చూసుకోకుండా ఖర్చు చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. మరి ఇంత ఖర్చు చేసిన తర్వాత కూడా ఓడితే ఆయన పరిస్థితి ఏమిటి? అన్నది మరో ప్రశ్న. ఏమైనా.. తెలుగు నేల మీద ఒక ఉప ఎన్నిక కోసం వందల కోట్లు ఖర్చు పెట్టే సంప్రదాయానికి తెర తీసిన రికార్డు మాత్రం కేసీఆర్ పేరు మీద ఉంటుందని చెప్పకతప్పదు.
Tags:    

Similar News