దేశ ఓటర్ల లెక్క తేల్చారు.. టాప్ '9'లో చోటు దక్కని తెలుగు రాష్ట్రాలు

Update: 2022-02-14 05:03 GMT
దేశ జనాభా దగ్గర దగ్గర 135 కోట్లుగా చెబుతుంటారు. ఇదిలా ఉంటే.. దేశంలో మొత్తం ఓటర్లు ఎందరు? అన్న లెక్క విషయానికి వస్తే తాజాగా కేంద్ర ఎన్నికల సంగం 2022 ఓటర్ల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో మొత్తం ఓటర్ల సంఖ్య 95,24,81,459 (సింఫుల్ గా చెప్పాలంటే 95.24కోట్లు). రెండేళ్ల క్రితం అంటే 2020లో విడుదల చేసిన ఓటర్ల జాబితాతో పోలిస్తే తాజాగా 3.26 కోట్ల మంది పెరిగారు. ఓటర్లలో మహిళల కంటే పురుషుల సంఖ్య 6.79 శాతం ఎక్కువగా ఉంది.

మొత్తం ఓటర్లలో అతి ఎక్కువమంది ఓటర్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ గా నిలిచింది. అతి తక్కువ ఓటర్లు ఉన్న రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. దేశ వ్యాప్తంగా ఓటర్లలో మహిళల కంటే పురుషులు ఎక్కువ మంది ఉంటే..తొమ్మిది రాష్ట్రాలు..  కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రం పురుష ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం.

మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న 9 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే..  

- పుదుచ్చేరి
- కేరళ
- మణిపుర్
- మిజోరం
- గోవా
- తమిళనాడు
- అరుణాచల్ ప్రదేశ్
- మేఘాలయ
- ఛత్తీస్ గఢ్

దేశంలో అత్యధిక ఓటర్లు ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఇప్పుడా రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 15.05కోట్లుగా తేలింది. అదే సమయంలో అతి తక్కువ ఓటర్లు ఉన్న రాష్ట్రంగా సిక్కిం 4.46 లక్షలుగా తేల్చారు. ఇక.. అతి తక్కువ ఓటర్లు ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా లక్షద్వీప్ నిలిచింది. ఇప్పుడు అక్కడి ఓటర్ల సంఖ్య కేవలం 56,269 మంది మాత్రమే. మొత్తం ఓటర్లలో ట్రాన్స్ జెండర్లుగా నమోదైన వారు 45,898. ఓటర్లలో ట్రాన్స్ జెండర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్.. తమిళనాడు.. కర్ణాటక.. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్లుగా తేలింది. ప్రవాసభారతీయ ఓటర్లు దేశంలో 1.22 లక్షల మంది కాగా.. అందులో ఎక్కువగా మంది కేరళ రాష్ట్రానికి చెందిన వారే. 92వేల మంది ప్రవాస భారతీయులు ఓటర్లుగా కేరళకు చెందిన వారు ఉన్నారు. తర్వాతి స్థానంలో మహారాష్ట్ర (7,065),  ఏపీ (7,033)లు నిలిచాయి.

సర్వీసు ఓటర్ల విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా 19.12 లక్షల మంది ఉండగా.. వారిలో అత్యధిక సర్వీస్ ఓటర్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. వారి సంఖ్య 2.98 లక్షలుగా తేలింది. ఇక.. దేశంలో యూపీ తర్వాత అత్యధిక ఓటర్లు ఉన్న 9 రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చోటు లభించలేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే.. నాలుగో స్థానం లభించేది. విభజన నేపథ్యంలో టాప్ 9లో చోటు లభించలేదు. ఎక్కువ ఓటర్లు ఉన్న టాప్ 9 రాష్ట్రాలు చూస్తే..

1. ఉత్తరప్రదేశ్
2. మహారాష్ట్ర
3. బిహార్
4. పశ్చిమబెంగాల్
5. తమిళనాడు
6. మధ్యప్రదేశ్
7. కర్ణాటక
8. రాజస్థాన్
9. గుజరాత్
Tags:    

Similar News