రజనీని అరెస్టు చేయమని కోర్టు చెబుతుందా?

Update: 2020-03-08 08:10 GMT
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనను కన్ఫర్మ్ చేసిన తర్వాత నుంచి ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను సునిశితంగా చూడటమే కాదు.. చిన్న మాటకు పెద్ద అర్థాన్ని తీస్తున్న వైనం అంతకంతకూ పెరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవల ఆయన పెరియార్ మీద చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.

1971లో సేలంలో ద్రవిడ కళగం పార్టీ అధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో శ్రీసీతారాముల చిత్ర పటాన్ని పెరియార్ విసిరేసినట్లుగా వ్యాఖ్యానించారు. దీనిపై పెను దుమారం రేగింది. రజనీ చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని పలువురు డిమాండ్ చేయగా.. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపోరాటానికైనా తాను సిద్ధమని తేల్చి చెప్పారు.

రజనీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు.. పలు ఇతర సంఘాల వారు డిమాండ్ చేశారు. అంతేకాదు.. రజనీ క్షమాపణలు చెప్పనని తేల్చేసిన నేపథ్యంలో ఆయనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో ద్రావిడన్ కళగం చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి తాజాగా చెన్నైలోని ఎగ్మూర్ నేర విభాగ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

తన వ్యాఖ్యలతో మతసామరస్యానికి ముప్పు వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారని.. ఆయన మాటలతో శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా చేస్తుందన్నారు.దీనికి స్పందించిన న్యాయస్థానం ఇప్పటివరకూ ఏమీ గొడవలు జరగలేదు కదా? అని ప్రశ్నించగా.. పెద్దగా గొడవలు జరగలేదు కానీ.. పుదుచ్చేరిలో పెరియార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వైనాన్ని ప్రస్తావించారు.

రజనీ లాంటి నాయకుల కారణంగానే ఇటీవల ఢిల్లీలో అల్లర్లు జరిగినట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. రజనీపై కేసు నమోదు చేయటమా? చేయకపోవటమా? అన్న విషయంపై ఏమీ తేల్చని కోర్టు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో సోమవారం.. రజనీని అరెస్టు చేయాలన్న ఆదేశాల్ని జారీ చేస్తుందా? అన్న అంశం ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News