కాంగ్రెస్ లో కోవ‌ర్టులు స‌రే!... ఒక్క‌రూ పేర్లు చెప్ప‌రే!

Update: 2019-05-09 14:03 GMT
తెలంగాణ‌లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారిపోతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల మీద ఎమ్మెల్యేలుగా గెలిచిన వారంతా ఒక్క‌రొక్క‌రుగా చేజారుతుంటే... పార్టీ అంత‌కంత‌కూ బ‌క్క‌చిక్కిపోతోంది. అస‌లు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా? అన్న అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి. పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌టానికి కార‌ణం బ‌య‌టి నేత‌లు కార‌ణం కాద‌ని - ఇంటి దొంగ‌లే పార్టీకి న‌ష్టం చేకూరుస్తున్నార‌న్న వాద‌న పార్టీలో బ‌లంగా వినిపిస్తోంది. ఈ వాద‌న‌ను పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న వి. హ‌న్మంత‌రావు ఇదివ‌ర‌కే బ‌య‌ట‌పెట్టేశారు. పార్టీలో ఉన్న కోవ‌ర్టుల కార‌ణంగానే న‌ష్ట‌పోతున్నామ‌ని, ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోరెందుకు? అంటూ ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే సంచ‌ల‌నం రేకెత్తించాయి.

కోవ‌ర్టులు ఎవ‌రో తెలిస్తే... చ‌ర్య‌ల విష‌యం చూడొచ్చు. మ‌రి పార్టీలో కోవ‌ర్టులున్నార‌ని, వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్న వీహెచ్‌... అలాంటి కోవ‌ర్టులు ఎవ‌రో చెబితే స‌రిపోతుంది క‌దా. మ‌రి వీహెచ్ అలా ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. స‌రే... ఆ కోవ‌ర్టుల‌కు వీహెచ్ భ‌య‌ప‌డి ఉంటార‌నుకుందాం. మ‌రి ఏ మాట అయినా చాలా గ‌ట్టిగానే కాకుండా మ‌న‌సులో ఏదీ దాచుకోకుండా అంతా క‌క్కేస్తార‌న్న పేరున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) అయినా ఆ పేర్ల‌ను బయటపెట్టొచ్చు క‌దా. అందుకు ఆయ‌న కూడా స‌సేమిరా అనే అంటున్నారు. పార్టీలో కోవ‌ర్టుల‌కు సంబంధించి ఇప్ప‌టిదాకా పోరాడుతున్న వీహెచ్ కు ఇప్పుడు జ‌గ్గారెడ్డి కూడా తోడ‌య్యారు. పార్టీలో కోవ‌ర్టులున్నార‌ని, వారి కార‌ణంగానే పార్టీ నానాటికీ బ‌క్క‌చిక్కిపోతోంద‌ని, అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని... గ‌తంలో వీహెచ్ డిమాండ్ చేసిన మాదిరే ఇప్పుడు జ‌గ్గారెడ్డి కూడా డిమాండ్ చేశారు.

అయితే సేమ్ టూ సేమ్‌... వీహెచ్ మాదిరే జ‌గ్గారెడ్డి కూడా కోవ‌ర్టుల పేర్ల‌ను వెల్ల‌డించేందుకు స‌సేమిరా అంటున్నారు. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు కోవ‌ర్టుల పేర్ల‌ను బ‌య‌ట‌పెడ‌తానంటూ వీహెచ్ చేసిన ప్ర‌క‌ట‌న మాదిరే జ‌గ్గారెడ్డి నోట కూడా అదే మాట వినిపించింది. మ‌రి పేర్లు బ‌య‌ట‌పెట్ట‌కుండా... ఊరికే కోవ‌ర్టులున్నారంటూ గోల చేయ‌డం ఎందుకో తెలియ‌డం లేద‌ని ఆ పార్టీలోని నేత‌లు... వీహెచ్ తో పాటు జ‌గ్గారెడ్డి వైఖ‌రిపైనా ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. మ‌రి ఈ గోల ఇలాగే కొంచెం విప్పిన‌ట్లు, కొంచెం విప్ప‌న‌ట్లుగా సాగుతుందా?.... లేదంటే వీహెచ్‌, జ‌గ్గారెడ్డిల మాదిరిగా కాకుండా ఇంకెవ‌రైనా ముందుకు వ‌చ్చి కోవ‌ర్టుల పేర్లు వెల్ల‌డిస్తారా? అన్న‌ది చూడాలి. అప్ప‌టిదాకా ఈ కోవ‌ర్టుల గోల క‌ర్ర విర‌గ‌దు - పాము చావ‌ద‌న్న రీతిలోనే సాగుతుంద‌ని మాత్రం చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News