వామ్మో.. అమెరికాలో రోజులో 1.54లక్షల కేసులు.. మన పరిస్థితేంటి?

Update: 2021-08-20 14:30 GMT
కరోనా మూడో కన్ను తెరిచింది. మొదటి.. రెండు దశల్ని చూసిన ప్రపంచానికి మూడో వేవ్ ఎంతలా ఉంటుందన్న విషయాన్ని పరిచయం చేయనుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మొదటి.. రెండు వేవ్ ల తర్వాత పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ జరిగిన నేపథ్యంలో అమెరికాలో మూడో వేవ్ అన్నది నామమాత్రంగా ఉంటుందని.. ఒకవేళ మొదలైనా దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యేది. కానీ.. ఆ అంచనాలు తప్పు అన్నట్లుగా తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా మూడో వేవ్.. మొదలైనట్లుగా కనిపిస్తోంది.

వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన అమెరికాలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. మొన్నటివరకు రోజుకు లక్ష కేసులు నమోదు అయితేనే.. షాక్ తిన్న ప్రపంచానికి తాజాగా రోజుకు 1.5లక్షల కేసులు నమోదు కావటం షాకింగ్ గా మారింది. తాజాగా గురువారం ఒక్కరోజులో 1.54 లక్షల పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదైనట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. ఎందుకిలా అన్నది అయోమయంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా గురువారం ఒక్కరోజునే 7.23 లక్షల మందికి వైరస్ సోకినట్లుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో రికార్డులు సరిగా నిర్వహించే అవకాశం లేని నేపథ్యంలో దగ్గర దగ్గర 12 నుంచి 13 లక్షల కేసులు నమోదై ఉండొచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికా తర్వాత బాధిత దేశంగా జపాన్ కనిపిస్తోంది. ఒలింపిక్స్ నిర్వహణ నేపథ్యంలో.. ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటం ఖాయమన్న అంచనా వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే.. జాపాన్ లో ఇప్పుడు కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. గత వారం సగటున రోజుకు 20 వేల చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మరింత ఎక్కువ నమోదవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో కరోనా కట్టడి కోసం జపాన్ లోని పలు కీలక ప్రాంతాల్లో ఎమర్జెన్సీని విధించారు. సెప్టెంబరు 12 వరకు అత్యవసర పరిస్థితి కొనసాగుతుందని చెప్పిన జపాన్ ప్రభుత్వం.. రెస్టారెంట్లు.. బార్లు రాత్రి 8 గంటల లోపు మూసివేయాలని.. షాపింగ్ మాళ్లలో ప్రజలు గుమిగూడవ వద్దని స్పష్టం చేస్తున్నారు.

టోక్యోతో సహా మొత్తం 14 ప్రాంతాల్లో  హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని..మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక ఎమర్జెన్సీని విధించాలని కోరినట్లుగా చెబుతున్నారు. తక్కువగా కేసులు నమోదైన దేశంగా చెప్పే ఆస్ట్రేలియాలోనూ తాజాగా కేసుల నమోదు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో దేశ రాజధాని సిడ్నీలో లాక్ డౌన్ ను పొడిగించారు. సెప్టెంబరు చివరి వరకు ఆంక్షలు ఉంటాయని చెబుతున్నారు. ఏమైనా.. ప్రపంచ వ్యాప్తంగా మూడో వేవ్ మొదలైనట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న నెల రోజులు మన వరకు చాలా కీలకమని చెబుతున్నారు. అక్టోబరు రెండు వారం వరకు కేసుల నమోదు లేని పక్షంలో మూడో వేవ్ నుంచి మనం తప్పించుకున్నట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News