కూటమిలో వామపక్షాలు లేవా...!?

Update: 2018-09-21 04:41 GMT
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటున్నా.... మహా కూటమిలో మాత్రం కదలిక అంతగా ఉండడం లేదు. కాంగ్రెస్ అగ్రనాయకులు - తెలుగుదేశం నాయకులు ఒకటి రెండు సార్టు కలుసుకుని చర్చించుకున్నారు. ఇక తెలంగాణ జన సమితి అగ్ర నాయకుడు కోదండరాం కూడా తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీతో కూడా టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. వామపక్షాల నుంచి ఇంకా ఎలాంటి పొత్తు చర్చలు జరగలేదు. దీంతో మహాకూటమిలో వామపక్షాలు ఉంటాయా... ఉండవా అనేది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. ప్రధాన పార్టీల మధ్య చర్చలు జరిగినా అందులో వామపక్షాలకు చెందిన అగ్ర నాయకులు ఎవ్వరూ పాల్గొనలేదు. దీనికి తోడు సిపిఎం 19 అభ్యర్ధులతో తన తొలి జాబితాను దాదాపుగా ఖరారు చేసింది. వారంతా కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించింది. పొత్తులు ఖరారు కాకుండా... ఏ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో అవగాహనకు రాకుండా ఇలా అభ్యర్ధులను ప్రకటించడంతో మహాకూటమిలో వామపక్షాలు చేరుతాయా... లేదా అన్నది అనుమానాలను కలిగిపస్తోంది.

మరోవైపు వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవర్ స్టార్ - జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయి. పవన్ కల్యాణ్ రాజకీయంగా కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అలాంటప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న మహాకూటమిలో వామపక్షాల చేరిక అనుమానాస్పదంగానే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ లో పవన్ కల్యాణ్‌ తో కలిస్తే వామపక్షాలకు కొద్దోగొప్పో సీట్లు వస్తాయని ఆ పార్టీల నాయకులు భావిస్తున్నారు. గడచిన పదేళ్లుగా వామపక్షాలకు చెందిన వారెవ్వరూ అధికారాన్ని అనుభవించడం లేదు. గతంలో తెలుగుదేశంతో కలిసినప్పుడు మాత్రమే వామపక్షాలకు చెందిన వారు వివిధ పదవులు అనుభవించారు. ఆ తర్వాత వారిది పోరాటమే తప్ప అధికారం అందుకోలేదు. దీంతో ఈ సారైనా పవన్ కల్యాణ్ తో కలిసి కొన్ని స్థానాల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌ లో తమ ఆధిపత్యాన్ని పెంచుకోవాలని భావిస్తున్నారు. ఇదే తెలంగాణలో వామపక్షాలకు అడ్డంకిగా మారిందటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తో జత కడితే వారిని వ్యతిరేకించే పవన్ కల్యాణ్ మహాకూటమిలో చేరికకు అంగీకరిస్తారా అని తెలంగాణ నాయకులు సంశయిస్తున్నారు. పైగా తెలంగాణలో పవన్ కల్యాణ్ తెలంగాణ రాష్ట్ర సమితి పాలనను కీర్తిస్తున్నారు. ఇలాంటి పరిప్ధితుల్లో వామపక్షాలు మహాకూటతమిలో కలవడం కష్టంగానే ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

Tags:    

Similar News