ప‌వ‌న్ తో క‌లిసి పోరాడుతాం:సీపీఐ రామ‌కృష్ణ‌

Update: 2018-03-15 12:52 GMT
నిన్న గుంటూరులో జ‌రిగిన జ‌న‌సేన ఆవిర్భావ దినోత్స‌వ స‌భ‌లో టీడీపీ - బీజేపీల‌పై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌సేన‌తో పాటు సీపీఐ - సీపీఎం పార్టీలు క‌లిసి వ‌స్తాయ‌ని - స‌భా వేదిక‌పై నుంచి ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. నేడు ఆ పార్టీ నేత‌ల‌తో భేటీ అవుతాన‌ని కూడా తెలిపారు. నేడు ఉద‌యం ప‌వ‌న్ తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ - ప‌లువురు సీపీఐ నేత‌లు భేటీ అయ్యారు. ఆ భేటీ అనంత‌రం సీఎం చంద్ర‌బాబుపై రామ‌కృష్ణ మండిప‌డ్డారు. చంద్ర‌బాబుకు ఏపీకి ప్రత్యేక హోదా - విభజన హామీలపై చిత్తశుద్ధి లేద‌ని విమ‌ర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అన్ని పార్టీలు ముక్త‌కంఠంతో చెబుతున్నా....అఖిలపక్షం ఏర్పాటు చేయడంలో చంద్ర‌బాబు తాత్సారం ఎందుకు చేస్తున్నారని ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు ...త‌మ పార్టీకి చెంద‌ని ఇద్ద‌రు కేంద్ర మంత్రుల‌తో రాజీనామాలు చేయించార‌ని - కానీ, ఎన్డీఏలో కొన‌సాగుతున్నార‌ని, మోదీ అంటే చంద్రబాబుకు భయమ‌ని చెప్పారు. దేశంలో బీజేపి పాల‌న‌పై ప్ర‌జ‌లు విసిగి పోయార‌ని, ఆ పార్టీ ఒంటెత్తు పోకడపై ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తార‌ని చెప్పారు. కేంద్రాన్ని ప్ర‌శ్నించేవారిపై సీబీఐ - ఐటీ దాడులు నిర్వ‌హిస్తున్నారని - సీబీఐ - ఐటీ శాఖ‌ల‌ను రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ వాడుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ఈ విషయాలతో పాటు మ‌రికొన్ని ప్ర‌జా స‌మ‌స్య‌లపైనా పవన్‌ కల్యాణ్ తో చర్చించామన్నారు. ఈ నెల 19న విజయవాడలో జర‌గ‌బోతోన్న రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ప‌వ‌న్ ను ఆహ్వానించామ‌న్నారు. రేపు పాత్రికేయుల సమస్యలపై త‌ల‌పెట్టిన‌ ఆందోళనలకు సీపిఐ - జనసేన మద్దతునిస్తాయ‌న్నారు. అలాగే, అగ్రిగోల్డ్‌ బాధితులకు త‌మ పార్టీలు అండ‌గా ఉంటాయ‌న్నారు.  పార్టీలప‌రంగా సీపీఐ - సీపీఎంలు వేరైనా ఉమ్మడిగా ఉద్యమం చేస్తున్నాయ‌న్నారు. రాష్ట్రంలో రాజ‌కీయ మార్పు రావాల‌ని - ధ‌నిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సామాన్యుల కష్టాలు తెలియ‌డం లేద‌ని అన్నారు.
Tags:    

Similar News