2019లో ఆ ఇద్ద‌రూ చెల్ల‌ని నోట్లేన‌ట‌

Update: 2016-12-02 13:11 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ - రాష్ట్రంలో ఆ పార్టీకి మ‌ద్ద‌తిస్తున్న టీడీపీపై ప్ర‌తిపక్షాలు సంద‌ర్భానుసారం విమర్శ‌లు చేస్తున్నాయి. సంద‌ర్భానుసారం విమ‌ర్శ‌లు చేయ‌డంలో పెట్టింది పేర‌యిన‌ సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మ‌రోమారు నోట్ల ర‌ద్దుపై ఈ రెండు పార్టీల ర‌థ‌సార‌థులు అయిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు లింక్ పెట్టి విమ‌ర్శ‌లు చేశారు. అణువిద్యుత్‌ కేంద్రం వద్దు... రామాయపట్నం పోర్టు కావాలంటూ పోర్టు సాధన సమితి - సీపీఐ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరయ్యారు. ధర్నాలో ఆయన మాట్లాడుతూ...ప్ర‌భుత్వాల తీరుపై మండిప‌డ్డారు.

బాధితుల‌కు అండ‌గా కమ్యూనిస్టు ఉద్యమాలపై తీవ్ర నిర్బంధం విధిస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించని మోడీ - చంద్రబాబులకు మతి భ్రమించిందని మండిప‌డ్డారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో ఏదో చేసేశామ‌ని ఈ ఇద్ద‌రు నేత‌లు భ్ర‌మ‌ప‌డుతున్నార‌ని నారాయ‌ణ వ్యాఖ్యానించారు. కానీ వారిద్దరూ 2019లో చెల్లని నోటు అవుతారని, ప్ర‌జ‌లు ఈ ర‌క‌మైన తీర్పు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని నారాయ‌ణ జోస్యం చెప్పారు. మోడీ-బాబు జోడీ అద్భుత‌మ‌ని ప్ర‌క‌టించారు కానీ ఆ ఇద్ద‌రి జోడీతో ప్రకాశం జిల్లా అన్ని విధాలుగా శాపగ్రస్తమైందన్నారు. పాలక పక్షాల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోలేదని  నారాయ‌ణ అన్నారు. దుగరాజుపట్నంలో పోర్టు ఏర్పాటుకు గ‌త పాలకులు చేస్తున్న కృషిలో ఒక్క శాతమైనా ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు చేయడం లేదని నారాయ‌ణ విమర్శించారు. కార్యక్రమానికి రామాయపట్నం పోర్టు సాధన సమితి ఆధ్వ‌ర్యంలో నిర్వాసితులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు.

ఇదిలాఉండ‌గా.. దివీస్‌ ఫార్మా ఫ్యాక్టరీ విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి  వ్య‌తిరేక‌త కొన‌సాగుతోంది. ఫార్మా ఫ్యాక్ట‌రీని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అధికారిక చర్చలు బెడిసికొట్టాయి. కాకినాడ కలెక్టరేట్‌లో  సమావేశానికి మూడు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై మరోసారి తమ నిరసనను తెలియజేశారు. 'మీ సమస్యలు చెబితే అపోహలను తొలగిస్తాం' అని కలెక్టర్‌ అరుణ్‌ కుమార్‌ - జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ బాధితులకు సూచించారు. 'మీరు రమ్మంటే ఏం చెబుతారో వినేందుకే వచ్చాం. మేం చెప్పాలంటే మా గ్రామాలకు మీరు రావాలి' అని చెప్పి సమావేశం నుంచి బాధితులు వెనుదిరిగారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. తొలుత జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ దివీస్‌ ఫ్యాక్టరీ వల్ల స్థానిక గ్రామాలకు ఎంతో ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు. 505 ఎకరాలు దివీస్‌ కు కావాల్సి ఉండగా, ఇప్పటికే 451 ఎకరాలు అప్పగించామని, 184 ఎకరాలకు పరిహారం అందించామని తెలిపారు. పరిహారం విషయంలో 76 కేసులు ఉన్నాయని చెప్పారు. దివీస్‌ ఫ్యాక్టరీ వల్ల వచ్చే నష్టాలు - అపోహలు - సమస్యలు తెలియజేయాలని బాధితులను కోరారు.

ఫార్మా ఏర్పాటు ప్రాంతానికి చెందిన స్థానికులు మాట్లాడుతూ 'మా గ్రామాలకు అధికారులు వచ్చి చర్చిస్తే బాగుంటుంది. మూడు నెలలుగా మేము ఇబ్బందులు పడుతుంటే ఇప్పటికైనా మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించినందుకు సంతోషం. మేం చర్చలకు రాలేదు. మీరు జనంలోకి వచ్చి బహిరంగ విచారణ చేయాలి' అని కోరారు. గ‌తంలో తమ గ్రామాన్ని కలెక్టర్‌ దత్తత తీసుకున్నారని, దివీస్‌ ఉద్యమం వచ్చాక ఆ గ్రామానికి రావడం మా నేశారని చెప్పారు. ఇప్పటికైనా కలెక్టర్‌ గ్రామానికి వచ్చి సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని కోరారు. సమావేశానికి కొంత ఆలస్యంగా వచ్చిన కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ పరిశ్రమలు లేకపోయినా కాలుష్యం ఉంటుందని తెలిపారు. మీ అపోహలు చెబితే అన్ని శాఖల అధికారులు ఉన్నందున వాటిని నివృత్తి చేస్తారని చెప్పారు. దీంతో బాధిత ప్రజలు ఒక్కసారిగా... 'మేము మీతో చర్చలకు రాలేదు. మీపై ఉన్న గౌరవంతో వచ్చాం. మీకు వినతి పత్రం ఇచ్చి వెళ్దాం అని వచ్చాం. మా గ్రామాలకు వచ్చి బహిరంగ విచారణ చేయాలి' అని కోరారు. అనంతరం వినతిపత్రం ఇచ్చి సమావేశం నుంచి వెనుదిరిగారు. బాధితులను ఉండాలని అధికారులు కోరినా వెళ్లిపోవడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News