జూనియర్ మ్యాటర్ అవసరమా డియర్ కామ్రేడ్...?

Update: 2022-09-02 01:30 GMT
కమ్యూనిస్టులు అంటే పేదల కోసం ప్రజల సమస్యల కోసం పాటు పడేవారు అన్న పేరు ఉంది. ఇక ప్రజాస్వామ్యానికి అత్యంత విలువ ఇస్తారు అని కూడా చెబుతారు. మరి ఒక టాప్ సినిమా హీరో ఒక టాప్ పొలిటీషియన్ తో భేటీ వేస్తే ఎర్రన్నకు ఎందుకు మంట అన్నదే ఇక్కడ మ్యాటర్. నిజానికి ఈ ఎర్రన్న సీపీయర్ సీనియర్ మోస్ట్ నేత. ఒక విధంగా భీష్మ పితామహుడు. ఆయన మాత్రం అవసరాన్ని మించి కామెంట్స్ చేస్తారని, సంబంధం లేని విషయాల మీద మాట్లాడుతారని ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి.

ఆ మధ్యన బీజేపీ పెద్దల పిలుపు మీద మెగాస్టార్ చిరంజీవి భీమవరం లో అల్లూరి 125వ జయంతి సభకి వెళ్తే ఇలాగే సీపీఐ నారాయణ పెద్ద నోరు చేశారు. చిరంజీవి మీద దారుణమైన కామెంట్స్ చేశారు. మొత్తానికి తరువాత నాలిక కరచుకున్నారు. నాడు ఆయన కోపానికి కారణం మోడీ పక్కన చిరంజీవి కూర్చోవడమే.

మోడీ బీజేపీ అంటే సిద్ధాంతపరంగా  వామపక్షాలకు పడకపోవచ్చు కానీ దేశంలో ఎవరూ వారిని కలవకూడదు అని కోరుకోవడం ఏమిటి. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది అన్నదే అర్ధం కాదు, సరిగ్గా అలాంటి పాయింట్ తోనే ఇపుడు జూనియర్ ఎన్టీయార్ మీద కూడా నారాయణ కామెంట్స్ చేశారు. అమిత్ షాని జూనియర్ ఎందుకు కలిశారు అంటూ ప్రశ్నలు సంధించారు. అలా కలవాల్సిన అవసరం ఏంటి అని కూడా నిగ్గదీస్తున్నారు.

ఇక్కడ అమిత్ షా కేంద్ర హోం మంత్రి. జూనియర్ ఆయన్ని కలిసింది ఒక సినిమా హీరోగా. ఈ భేటీలో రాజకీయాలు చూడాల్సిన అవసరం ఏముంది అన్నది ఒక ప్రశ్న అయితే పోనీ రాజకీయమే ఉంది అనుకున్నా అది ఆ ఇద్దరి ఇష్టం కదా. దాన్ని కాదనే హక్కు సీపీఐకి ఎక్కడ ఉంది. ప్రజాస్వామ్య స్పూర్తి అని గొంతు చించుకునే వామపక్షాలు ఎవరు ఎవరిని కలవాలో కూడా తామే చెబుతాయా అన్నది మరో ప్రశ్న.

ఇంతకీ జూనియర్ కలిస్తే కామ్రేడ్స్ కి ఎందుకు కలవరం. బీజేపీ బలోపేతం అవుతుందన్న కంగారు ఏమైనా ఉంటే జనాల వద్దకు వెళ్ళి వారిని ఓడించాలని చెప్పాలి కానీ సినీ నటులను ఇతర ప్రముఖులను బీజేపీతో ఎవరూ కలవవద్దు అని కట్టడి చేసేలా ప్రకటనలు చేయడం ఎంతవరకూ సమంజసం అన్న మాట కూడా వినిపిస్తోంది.

ఇక జూనియర్ అమిత్ షా భేటీలో ఏమి జరిగిందో ఈ రోజుకీ తెలియదు. ట్రిపుల్ ఆర్ మూవీ బాగుందని, అందులో జూనియర్ పాత్రను మెచ్చి ఆయనను ప్రత్యేకంగా పిలిపించుకుని అభినందించారని అమిత్ షా గురించి బీజేపీ నేతలు చెప్పారు. ఇక జూనియర్ అయితే పెదవి విప్పలేదు. అయినా జూనియర్ కి రాజకీయాల్లోకి రావాలీ అంటే ఆయన నచ్చిన పార్టీని ఎంచుకుంటారు.

ఘనత వహించిన రాజకీయ చరిత్ర ఉన్న పార్టీ కుటుంబం లోని వ్యక్తి జూనియర్ అని సీపీఐ నారాయణ అంటున్నారు కానీ టీడీపీ వారు ఆయనను అలా చూశారా అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. ఏది ఏమైనా అమిత్ షా జూనియర్ కలవడం అన్నది టీడీపీకి మింగుడు పడడంలేదు అని అంటున్నారు. దాంతో వారు బయటకు ఏమీ మాట్లాడకపోయినా ఇపుడు సీపీఐ లాంటి పార్టీలు మాట్లాడి వారి గొంతుకనే తమ నోట వినిపించాయని అనుకోవచ్చా అంటే ఏమో అన్న మాట కూడా ఉంది మరి.

ఏది ఏమైనా జూనియర్ భేటీలు ఎవరితో అయినా వేస్తారు. ఆ విషయంలో కామ్రేడ్స్ కి వచ్చిన బాధ ఏంటో అన్నదే ఇక్కడ ప్రశ్న. గత కొన్నేళ్ళుగా భారతదేశాన  బీజేపీని నిలువరించాలన్న ప్రయత్నంలో ఇంకా బలోపేతం చేసిన నేపధ్యం చాలా  ఉంది. జనాల వద్దకు పోయి కాషాయం ముట్టొద్దు కట్టొద్దు అని చెప్పుకుంటే ఒక రాజకీయ పార్టీగా వామపక్షాలను ఎవరూ ఏమీ అనరు. కానీ ఇలా చిరంజీవి, జూనియర్ లను బీజేపీ వారితో కలవవద్దు అని చెప్పడం అంటే ఇదేంటి కామ్రేడ్ అని అనాల్సి వస్తుందేమో కదా.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News