ప్ర‌ధానిపై మ‌ర్డ‌ర్ కేసు పెట్టాలి

Update: 2016-12-17 06:03 GMT
సంద‌ర్భం ఏదైనా - చెణుకులు-విమ‌ర్శ‌లు-కామెంట్ల‌తో అంద‌రి దృష్టిని త‌న‌వైపు తిప్పుకొనే సీపీఐ జాతీయ కార్యదర్శి  నారాయణ తాజాగా జాతీయ గీతంపై స్పందించారు. సినిమాహాళ్లలో జాతీయగీతాన్ని ఆలపించాలనే నిబంధనపై నారాయణ స్పందిస్తూ ఇది పబ్బుల్లో జానపద నృత్యం లాంటిదేన‌ని వ్యాఖ్యానించారు. దేశ భక్తిని - ఔన్నత్యాన్ని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అయినప్పటికీ దానికీ ఓ పద్ధతి ఉంటుందని దీనిపై సుప్రీం కోర్టుకు లేఖ రాశానని నారాయ‌ణ తెలిపారు. ఆర్‌ ఎస్‌ ఎస్ దాడులను ప్రోత్సహించేందుకే దేశభక్తి అంటూ పిచ్చి నిబంధనలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని ప్రజలే తిప్పికొట్టాలని నారాయ‌ణ‌ పిలుపునిచ్చారు.

కాగా పెద్ద నోట్ల ర‌ద్దుపైనా నారాయ‌ణ త‌న‌దైన శైలిలో స్పందించారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ చెల్లని నోటుగా మిగిలిపోతారని ఆయ‌న వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా 120 మంది సామాన్యులు మృతిచెందారని ఇవన్నీ మోదీ చేసిన హత్యలుగానే భావించాల్సి ఉందని ఆరోపించారు. ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ప్రధానమంత్రిపై హత్యానేరం మోపాలని నారాయ‌ణ డిమాండ్ చేశారు. పెద్ద నోట్ల రద్దు విషయం ముందుగానే కొందరు మోదీ సన్నిహితులకు తెలుసని ఆరోపించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అవినీతి కుంభకోణాల చరిత్ర దేశానికి తెలుసన్నారు. మోదీకి మతిస్థిమితంలేక ప్రజలపై సర్జికల్ దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో పెట్టుబడిదారీ - కార్పొరేట్ శక్తులకే లబ్ది చేకూరిందని నారాయ‌ణ‌ విమర్శించారు. సామాన్య - మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ చర్యలతో అద్వానీ వంటి సీనియర్ నేతలే తలలు పట్టుకుంటున్నారని పేర్కొంటూ ఆయనకు ప్రజా కోర్టులో శిక్ష తప్పదని నారాయ‌ణ‌ స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News